Karimnagar |
- రెండు కోట్ల మేర చేతులు మారాయని కార్మికుల ఆరోపణ
- పవర్ లూమ్ టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ ను తొలగించాలని..
- సిరిసిల్ల జిల్లా క్లాత్ బ్యానర్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్
విధాత బ్యూరో, కరీంనగర్: అధికారంలో ఉండగానే నాలుగు రాళ్లు సంపాదించాలంటే, అది చిన్న పని అయినప్పటికీ కమిషన్లకు కక్కుర్తి పడాల్సిందే! అధికార పార్టీ నేతల కమిషన్ల కక్కుర్తిలో ఇప్పుడు జాతీయ జెండా కూడా వచ్చి చేరింది. ఆగస్టు 15న ఘనంగా జెండా పండుగ నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతియేటా పెద్ద సంఖ్యలో త్రివర్ణ పతాకాల తయారీకి ఆర్డర్ ఇస్తోంది.
ఈ సంవత్సరం కూడా కోటి యాభై లక్షల జెండాల తయారీకి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇందుకోసం నేరుగా వస్త్రాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం, జెండాల ముద్రణ అనంతరం వీటి కటింగ్,, స్టిచింగ్ పనులు చేనేత కార్మికులకు అప్పగిస్తూ వస్తుంది.
ఒక్కో జెండా కట్ చేసి, స్టిచింగ్ చేసి ఇవ్వడానికి ప్రభుత్వం ఐదు రూపాయల ధర నిర్ణయించింది.
అయితే ఇందులో తెలంగాణ పవర్ లుాం టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు మురళీ, టెక్స్ టైల్
పార్క్ కు సంబంధించిన యాదగిరి చేతివాటం ప్రదర్శించారని సిరిసిల్ల జిల్లా క్లాత్ బ్యానర్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు.
శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్ష, కార్యద ర్శులు ఎక్కలదేవి శ్రీనివాస్, ఎల్ది చక్రపాణి మాట్లాడుతూ జాతీయ జెండాల కటింగ్, స్టిచింగ్‌ల ఆర్డర్ అనేది ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. మూడు దశాబ్దాలుగా ఇదే వృత్తిపై ఆధార పడి ఉన్న తమను విస్మరించి కమిషన్ల కోసం ఈ పనిని ఒకరిద్దరికి కట్టబెట్టారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఆర్డర్ కేటాయింపుపై విచారణ జరపాలని, గూడూరు ప్రవీణ్ ను ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
కమీషన్ల కోసం చైర్మన్ ప్రవీణ్, యాదగిరి ఒకే కుటుంబానికి పనులు అప్పగించి కార్మికులందరికీ అన్యాయం చేశారని విమర్శించారు. గత సంవత్సరం జెండాల కటింగ్, స్టిచింగ్ పనులు నిర్వహించిన తమకు నేటికీ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని చెప్పారు. గత సంవత్సర బకాయిల కోసం కూడా తాము రోడ్డెక్కి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
జెండాల కటింగ్, స్టిచింగ్ పనుల ఆర్డర్ విషయం తెలిసిన వెంటనే తాము పవర్ లూమ్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ చైర్మన్ మురళీ, పార్క్ కు సంబంధించిన యాదగిరిలను కలిసి పనుల కోసం కోరగా, అది తమ చేతుల్లో లేదని సమాధానం ఇచ్చారన్నారు. దీంతో తాము సంబంధిత శాఖ కార్యదర్శి బుద్ధ ప్రసాద్ ను హైదరాబాద్ లో కలసి వినతి పత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినప్పటికి ఫలితం లేకుండా పోయిందన్నారు.
ఒక్కో జెండా కటింగ్, స్టిచింగ్ పనులను రెండు రూపాయల చొప్పున అప్పగించి, జెండాపై వీరు మూడు రూపాయలు లబ్ధి పొందారని చెప్పారు. చిన్నగా కనిపించే ఈ వ్యవహారంలోనే రెండు మూడు కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ఇదంతా స్థానిక శాసనసభ్యుడు, మంత్రి కే. తారక రామారావుకు తెలియకుండా జరిగిందన్నారు. ఈ కమిషన్ల వ్యవహారాన్ని రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.