Site icon vidhaatha

Karimnagar | బీజేపీకీ, బీఆర్ఎస్‌కు తేడా ఏముంది..: కూర రాజన్న

Karimnagar

విధాత బ్యూరో, కరీంనగర్: జనజీవన స్రవంతిలోకి రావాలని మీరే చెప్తూ, బయటకు వచ్చాక అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని జనశక్తి పార్టీ మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న ఆరోపించారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అటు ప్రభుత్వం, ఇటు పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పుడు వాటిని అణిచివేయాలని, తొక్కి పారేయాలనే ఆలోచన చేస్తున్న వారికి తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజాస్వామిక హక్కుల అణచివేతకు ప్రభుత్వం సిద్ధపడితే, కేంద్రంలోని బీజేపీకి ఇక్కడి ప్రభుత్వానికి మధ్య తేడా ఏముందని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ తో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో ‘ ఆర్మూర్ పోలీస్ స్పెషల్ పవర్ యాక్ట్’ కు ఇక్కడి పోలీసులు అనుసరిస్తున్న తీరుకు పెద్దగా తేడా లేదన్నారు.

రాష్ట్రంలో మాట్లాడే హక్కును, పాట పాడే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, ప్రజల న్యాయమైన డిమాండ్లపై పోరాడే హక్కును ఈ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గళాల నోర్లు కుట్టేసి, కాళ్లు చేతులు కట్టేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం పోలీసుల సహకారంతో చేస్తోందని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా ఉద్యమ చరిత్రలో తనది కీలకమైన పాత్ర అన్నారు. ప్రాంతంలో తనకు కనీసం ఇల్లు కూడా లేదని, 20 రకాల జబ్బులతో అనారోగ్యం పాలై ఉన్నానని, వాటి కారణంగా నిరంతర వైద్యుల పర్యవేక్షణ అవసరం ఉందని చెప్పారు.

ఓ స్నేహితుడు తనకు ఆశ్రయం ఇచ్చినందుకు స్థానిక పోలీసులు అతనిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వేములవాడలోని సత్రంలో ఉంటున్న తనను కూడా పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నానా హంగామా సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన నుండి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని చెబుతున్నా, పోలీసులు ఇంతగా వేధించడం సబబు కాదంటూ ఖాకీ బట్టలు వేసుకోగానే మీకేమైనా కొమ్ములు వచ్చాయా అంటూ వారిని నిలదీశారు.

పోలీసుల వైఖరి ఇలాగే ఉంటే జనశక్తిని మళ్లీ రీ ఆర్గనైజ్ చేస్తానంటూ ఆయన హెచ్చరించారు. అడవుల్లో నుండి వచ్చిన తమను పోలీసులే తిరిగి అడవుల్లోకి వెళ్లే విధంగా చేస్తున్నారని ఆరోపించారు.

Exit mobile version