కేసీఆర్ ‘చరిత్ర’ చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది.. : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

హైద‌రాబాద్‌, విధాత‌: కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శ‌నివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణపూర్ గ్రామంలో జ‌రిగిన‌ “ప్రజా పాలన– ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేస్తే.. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేది లేదని కేసీఆర్ పడావు పెట్టారని ఆరోపించారు. చేవెళ్ల దగ్గర ఉన్న ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకమే అందుకు సజీవ సాక్ష్యమ‌ని చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు 3 టీఎంసీలు గోదావరి జలాలను అందిస్తే వేల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారామని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి చెప్పార‌ని, మరి చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి అనుమతులు ఎందుకు తీసుకురాలేదని సీఎం ప్ర‌శ్నించారు. మీరు చేసిన ద్రోహానికి ప్రజలను కలిసే అర్హత ఉందా? అని సబితా ఇంద్రారెడ్డిని అడిగారు.

రోజ‌మ్మ రొయ్య‌ల పులుసు తిని…

రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెప్పిన‌ కేసీఆర్… రంగారెడ్డికి గోదావరి జలాలు ఇస్తానని మాత్రం చెప్పలేదని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. లక్ష్మీదేవిపల్లిలో నిర్మించ‌త‌ల‌పెట్టిన‌ రిజర్వాయరుకు భూసేకరణ త్వరలోనే పూర్తిచేస్తామ‌ని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు రూపొందిస్తామ‌ని తెలిపారు. కాళేశ్వరంతో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఫామ్ హౌసులు కట్టుకొని వ్యాపారాలు పెట్టుకున్నారు తప్ప రంగారెడ్డి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేద‌ని ముఖ్యమంత్రి మండిపడ్డారు. గోదావరి జలాలు తెచ్చి తాండూరు, పరిగి,వికారాబాద్ సస్యశ్యామలం చేసే బాధ్యత మాదని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ద‌ళితుల‌ను మోసం చేసిన కేసీఆర్‌

కేసీఆర్ దళితులను మోసం చేస్టే.. మేం దళితులకు స్పీకర్ గా, మంత్రులుగా అవకాశం కల్పించామ‌ని, అందుకే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ముఖం చాటేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాగ్నా నుంచి తాగునీరు అందిస్తామ‌న్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజక వర్గాలకు కృష్ణా జలాలు తరలించి 1 లక్ష 50 వేల ఎకరాలకు నీరు అందిస్తామ‌న్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రోడ్డు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోయారని… ఈ పాపం కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డిల‌ది కాదా అని అడిగారు. కోర్టు కేసులను పరిష్కరించి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రోడ్డు పనులను వేగవంతం చేశామ‌ని తెలిపారు. తాండూర్ రోడ్డును కూడా పూర్తి చేసే బాధ్యత మాదన్నారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు రాబోతున్నాయని తెలిపారు. వికారాబాద్ ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారబోతోందన్నారు.

గత తప్పులు సరిదిద్దుతున్నాం

గత ప్రభుత్వం చేసిన అప్పులను.. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నామ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్, కేంద్రంలో పన్నెండేళ్లు మోదీ అధికారంలో ఉన్నా రాష్ట్రానికి చేసిందేం లేద‌న్నారు. మోదీని చూసి ఓట్లు వేయాలని బీజేపీ నాయకులు అంటున్నతీరును రేవంత్ త‌ప్పు ప‌ట్టారు. ఎవరైనా పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తారా..! మోదీని చూసి ఓటేస్తే గల్లీలో ఉండే బోడిగాడు పనిచేయకపోతే ఢిల్లీకి వెళ్లి అడగాలా? అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు వాళ్ల బీ ఫామ్ బీఆరెస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నారట…బీజేపీ, బీఆరెస్ వి చీకటి ఒప్పందాలని ఆరోపించారు. ఆనాడు నిజంగా కేసీఆర్, మోడీ నిధులు ఇచ్చి ఉంటే వాళ్లకు ఇవాళ ఇల్లు ఇల్లు తిరిగి ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఎందుకు? వ‌స్తుంద‌న్నారు.

రాబోయే ఎనిమిదేళ్లూ కాంగ్రెస్‌ పాలనే

కేసీఆర్, కల్వకుంట్ల కిషన్ రావ్ రాసిపెట్టుకోండి…రాబోయే ఎనిమిదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది.. అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ నుంచి ఊర్లమీదకు మారీచుడు, సుబాహును పంపించాడని కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల నుద్దేశించి రేవంత్ అన్నారు. తాము చేసే అభివృద్ధిని అడ్డుకోవాలని వాళ్లు చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని, ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారని ప్ర‌శ్నించారు. కేసీఆర్ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్ననని నన్ను హరీష్, కెటీఆర్ విమర్శిస్తున్నారని, కేసీఆర్ దొంగ పాస్ పోర్టుల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా అని అన్నారు. కేసీఆర్ పై దొంగనోట్ల కేసు నమోదు అయిందని మీ పక్కనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పాడన్నారు. మీ దొంగనోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా..! దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ దొంగహామీల చరిత్ర నేను చెరిపితే పోతుందా..! మీ చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరని, తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోదన్నారు. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాదని రేవంత్ తెలిపారు.

Latest News