• Telugu News
  • /Telangana

రైతు భరోసా నిధులు 30 నుంచి పంపిణీ

తెలంగాణలో జూన్ 30 నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభం కానుంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది ప్రభుత్వం.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 18, 2026, 3:45 pm IST
Read Time: 3 mins
రైతు భరోసా నిధులు 30 నుంచి పంపిణీ

తెలంగాణలో ఈ నెల 30 నుంచి వానాకాలం సీజన్‌ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఆ రోజున మధిరలో బహిరంగ సభ నిర్వహించి నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన మంత్రివర్గం అనధికార సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. వాన కాలం పంట సాగుకు సిద్దమవుతున్న రైతులకు ప్రభుత్వ అందించనున్న రైతు భరోసా సహాయం పెట్టుబడులకు కీలకం కానుంది.

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ. 6వేల చొప్పున రెండు దఫాలుగా సంవత్సరానికి రూ.12వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో 67.01లక్షల మంది రైతులకు రూ.138కోట్ల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల కానున్నట్లుగా సమాచారం. తొమ్మిది రోజులలో రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది

కాగా అనధికార కేబినెట్ భేటీలో హైదరాబాద్‌ మెట్రో రైలు, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన, తుమ్మడి హట్టి ప్రాజెక్టు నిర్మాణం, వాన కాలం పంట సీజన్ కు విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి అంశాలపై చర్చించినట్లుగా సమాచారం.

23న కేంద్రం నుంచి పీఎం కిసాన్ నిధులు

మరో వైపు 23వ ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద నిధులను కేంద్రం జూన్ 20వ తేదీన విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దాంతో ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున నగదు జమ కానుంది.