కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

Reported by: Jagan Mohan Talluri | విధాత ప్రత్యేకం | Edited by: విధాత ఎక్స్క్లూజివ్ డెస్క్ | Aug 17, 2026, 4:38 pm IST
Read Time: 18 mins
కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

హైలైట్స్:

  • స్థానిక పార్టీలో ఎవరికివారే యుమునాతీరు
  • డీసీసీ ప్రసిడెంట్ ఇనుగాలది మరో వర్గం
  • కొండా వర్సెస్ రేవూరి మధ్య సీఎం ప్రకటన
  • స్థానిక కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త ట్విస్టు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సొంత పార్టీలో కొత్త కుంపటి రాజేసింది. సీఎం పర్యటన వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒనగూరిన ప్రయోజనమెంతోగానీ, ఆ పార్టీలో అంతర్గతంగా పరకాల నియోజకవర్గం చుట్టూ నెలకొన్న రాజకీయ వర్గపోరుకు తెరదించారా? లేక కొత్తగా తెరలేపారా? అనే ఆసక్తి కరమైన చర్చ రాజకీయవర్గాల్లో షురువైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మరోసారి గెలుస్తారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీచేస్తారంటూ సీఎం రేవంత్ ప్రకటించడం ఒక సాధారణ సానుకూల ప్రకటనగానే కనిపిస్తున్నప్పటికీ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రత్యేకతల రీత్యా సొంత పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో సీఎం ప్రకటన కుంపటి రాజేసిందని కొందరు భావిస్తుండగా, అంతర్గతంగా ఉన్న విభేదాలకు తెరదించుతూ స్పష్టమైన ప్రకటన చేశారంటూ మరి కొందరు భావిస్తున్నారు. సీఎం ప్రకటన రేవూరి వర్గంలో సంతోషాన్ని నింపగా, కొండా వర్గంలో నిరాశ కనిపిస్తున్నది. కొందరు నాయకులు అవకాశవాదంతో వ్యవహరించినా నియోజకవర్గంలో పార్టీని కాపాడింది తానేనంటూ ఇనుగాల తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఈ పరకాల గడ్డ…అడ్డా కథేంటీ!?

పరకాలలో సీఎం రేవంత్ ప్రకటన పై భిన్న రకాల చర్చలు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డికి మరోసారి పోటీచేసే చాన్సు… అది కూడా ఇంకా ఎన్నికలు రెండేళ్ళ ముందే ప్రకటన చేస్తే ఇంత రాజకీయ వివాదానికి, రాద్ధాంతానికి ఎందుకు కారణమవుతోందంటూ భిన్న చర్చసాగుతోంది. అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ పరకాల గడ్డ… అడ్డా కథేంటనే చర్చ సాగుతోంది. ఈ కథ వెనుక కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.

పదేండ్ల తర్వాత కాంగ్రెస్‌కు అవకాశం

తెలంగాణ ప్రజల అనేక పోరాటాలు, వందలాది మంది త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. 2014లో అప్పటి యుపీఎ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మూకుమ్మడిగా విఫలమైంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి కూడా కారణమనే అభిప్రాయం ఆ పార్టీలో కూడా ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తెలంగాణ ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రయ్యారు. ఆ తర్వాత ఏకంగా పదేళ్ళు కేసీఆర్ పాలన సాగింది. పదేళ్ళు అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఉనికి ఒక దశలో ప్రశ్నార్ధకంగా మారింది. ఈ స్థితిలో 2023లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు జరిగాయి. అనూహ్య పరిణామాల మధ్య పరకాల అసెంబ్లీ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల ప్రకటన వరకూ కూడా రేవూరి బీజేపీలో కొనసాగారు. నామినేషన్ కు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం. రేవూరి గతంలో టీడీపీ నుంచి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. హనుమకొండ నుంచి కూడా పోటీచేశారు. ఇప్పుడు పక్క నియోజకవర్గమైన పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గ కాంగ్రెస్లో గ్రూపుల వర్గపోరు ఆ తర్వాత రోడ్డెక్కాయి. దీంతో పరకాల రాజకీయం మూడు ముక్కలాటగా మారి రాష్ట్రంలో కొత్త చర్చను లేవనెత్తింది.

పరకాల కాంగ్రెస్ లో మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్ లో మూడు ముక్కలాట సాగుతోంది. స్థానికంగా పార్టీ కేడర్ రేవూరి, కొండా, ఇనుగాల వర్గాలుగా విడిపోయారు. ఈ విచిత్ర పరిస్థితికి పలు కారణాలున్నాయి. ఈ నియోజవర్గాన్ని ఎవరికి వారు తమ సొంత జాగీరుగా భావించడమే ఈ వివాదానికి కారణంగా భావిస్తున్నారు. గతంలో పరకాల ఎమ్మెల్యేగా పనిచేసిన, ప్రస్తుత వరంగల్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దంపతులది ఒక గ్రూపు, గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన మాజీ నియోజకవర్గ ఇంచార్జ్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాం రెడ్డిది మరో గ్రూపు, ఇక ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది మరో గ్రూపు. ఈ గ్రూపు రాజకీయాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో నాయకులు బహిరంగంగా బాహాబాహికి దిగిన సందర్భాలున్నాయి. కొండా దంపతుల సొంత గ్రామం వంచనగిరి, మండలం గీసుకొండ పరకాల నియోజకవర్గంలో ఉంటోంది. గతంలో శాయంపేట ఎమ్మెల్యేగా, పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సురేఖ గెలుపొందారు. 2009లో వైఎస్ మంత్రి వర్గంలో సురేఖ పనిచేశారు. ఆయన మరణం తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వెంట వైఎస్సార్సీపీలో చేరారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి ములుగూరి భిక్షపతి చేతిలో ఓటమిపాలయ్యారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కొద్ది రోజులకే ఎన్నికలురావడంతో టీఆర్ఎస్ చేరి వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో తొలి జాబితాలో సురేఖకు టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరి తూర్పును విడిచిపెట్టి పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత చాలా కాలం స్తబ్ధంగా ఉన్న కొండా దంపతులు 2023 ఎన్నికలకు కొద్ది నెలల ముందు తిరిగి వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచి, రేవంత్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఈ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనుగాలకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవూరికి చాన్సు ఇవ్వడంతో అంతా ఆయన విజయానికి సహకరించారు.

రేవూరి, కొండా వర్గాల మధ్య వైరం:

పరకాల నియోజవర్గంలో తమ వర్గం నాయకులను రేవూరి తొక్కేస్తున్నారంటూ కొండా దంపతులు బహిరంగంగా ఎమ్మెల్యే రేవూరి పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల ముందు తమ కాళ్ళుపట్టుకుని ఇప్పుడు తమ పై పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. రేవూరి, కొండా దంపతుల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరి రోడ్డునపడ్డారు. గీసుకొండ మండలంలో కేసులతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతే మంత్రిగా సురేఖ అక్కడికి వెళ్ళిన సందర్భాలు విమర్శలకు తావిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఒకే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరి, కొండా వర్గాలు వేర్వేరు పోటీచేసి గెలుపోటములను చవిచూశారు. ఈ ఇద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరిన సందర్భంలో కొండా కుటుంబం తీవ్రంగా ప్రతిస్పందించింది.

పరకాల మా అడ్డా : కొండా దంపతులు

వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తమ కుమార్తె సుస్మిత పోటీచేస్తారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రకటించగా, తాను పోటీ చేసి తీరుతానంటూ కొమ్మాల జాతర సందర్భంగా సుస్మిత కూడా బహిరంగంగా తేల్చి చెప్పారు. పరకాల మా అడ్డా అంటూ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. దాదాపు గత మూడేళ్ళుగా రేవూరి, కొండా వర్గాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ వాదులను, తమ అనుచరులను, వర్గాన్ని రేవూరి అణచివేస్తున్నారంటూ కొండా దంపతులు ఆగ్రహంతో ఉన్నారు.

ఇబ్బందుల్లో ఇనుగాల

2014లో పరకాల నుంచి ఇనుగాల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2023 వరకు పరకాల కాంగ్రెస్ ను పట్టుకుని ముందుకు సాగారు. 2018లో సురేఖ కోసం, 2023లో రేవూరి కోసం ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన ఇనుగాల వెంకట్రాం రెడ్డి ప్రాతినిధ్యం పరకాలలో లేకుండా రేవూరి ప్రయత్నిస్తున్నారని వీరి మధ్య కూడా పంచాయతీ సాగుతోంది. స్థానిక నేతగా, డీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ రేవూరి వర్గం తనను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొండా వర్గంతోనూ ఆయనకు విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పరకాలలో జరిగిన సీఎం రేవంత్ సభకు డీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ ఇనుగాల గైర్హాజరు కావడం కలకలం సృష్టించింది.

సిట్టింగ్ రేవూరిది మరొ రకమైన ఆవేదన

పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డిది మరొ రకమైన ఆవేదన. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తన ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో కొండా దంపతులు తనకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని అంటున్నారు. తూర్పులో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంటూ పరకాలలో తమ పెత్తనమే సాగాలనడం సరైంది కాదంటున్నారు. ఆ మాట కొస్తే తూర్పులో పాత కాంగ్రెస్ నేతలు తమ ఆధిపత్యం సాగాలంటే ఒప్పుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాము చెప్పినట్లే పరకాలలో నియోజకవర్గంలో వారి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలంటున్నారని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ చెబుతున్నారు. ఇరువర్గాల ఆధిపత్యంతో పరకాల నియోజకవర్గంలో పరిస్థితి మరింత తీవ్రస్థాయికి చేరింది. ఈ విషయాన్ని రేవూరి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. ఎవరికి వారు పరకాల గడ్డ తమ అడ్డా అంటూ పార్టీని పక్కన పెట్టి సొంత అనుచరులతో గ్రూపులు నిర్వహించడమే దీనికి ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నాయకుల వ్యక్తిగత ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని, కాంగ్రెస్ పార్టీ విజయానికి ఏళ్ళుగా ప్రయత్నిస్తున్న నిజమైన నాయకులు, కార్యకర్తలకు ఈ వర్గపోరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి మరోసారి పోటీచేస్తారంటూ ప్రకటించడంతో కొండా వర్గం జీర్ణించుకోలేక పోతోంది. తమ కుమార్తె సుస్మిత పోటీ చేస్తుందంటూ తాము ప్రకటిస్తే… జిల్లాలో తమ ఆధిపత్యానికి గండికొడుతున్నారనే అభిప్రాయంతో ఆ వర్గం నాయకులు మండిపడుతున్నారు. సీఎం ప్రకటన పై కొండా దంపతుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందోననే చర్చ సాగుతోంది.

Jagan Mohan Talluri
jaganmohan.talluri@gmail.com