• Telugu News
  • /National

మొన్న కాక్రోచ్..నేడు ‘దిమాగీ నక్సల్ పార్టీ’.. సోషల్ మీడియాలో క్రేజ్..!

మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ’ ట్రెండ్ అవుతోంది. 24 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 17, 2026, 3:47 pm IST
Read Time: 6 mins
మొన్న కాక్రోచ్..నేడు ‘దిమాగీ నక్సల్ పార్టీ’.. సోషల్ మీడియాలో క్రేజ్..!

స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యల తర్వాత ‘దిమాగీ నక్సల్ జనాతా పార్టీ’ పేరుతో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన పార్టీకి ఒక్క రోజు వేలాది మంది ఫాలోవర్ల రావడం హాట్ టాపిక్ గా మారింది. 24 గంటల్లోనే 2 లక్షల ఫాలోవర్స్ సంపాదించింది. దిమాగీ నక్సల్ జనతా పార్టీ అనే ఇన్ స్ట్రాగ్రామ్, ఎక్స్ హ్యాండిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మేం భగత్ సింగ్ అనుచరులం.. ఒక వేళ వాళ్లు మా అకౌంట్లను బ్లాక్ చేసినా.. నిలిపివేయటానికి ప్రయత్నించినా లేదా మమ్మల్ని దేశ ద్రోహులుగా ముద్ర వేసినా.. అలాంటి వాళ్లు భగత్ సింగ్ ను అవమానించినట్లే అంటూ నోట్ రిలీజ్ చేసింది దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ.

‘థింక్.. రీసెర్చ్.. రెసిస్ట్’ నినాదంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘దిమాగీ నక్సల్ పార్టీ’ పేరిట ప్రారంభమైన ఖాతాకు కేవలం 24 గంటల్లోనే 2లక్షల మందికిపైగా ఫాలోవర్లు చేరారు. ఇక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ’ పేరుతో ఉన్న ఖాతాకు 50,000 మందికి పైగా ఫాలోవర్లు వచ్చారు. ఈ పార్టీ వ్యవస్థాపకుడు “ఒక మేధావి భారతీయుడు” (A Dimagi Indian) అని, సహ వ్యవస్థాపకుడు “56 అంగుళాల వ్యక్తి” (56 Inch ka) అని చమత్కారంగా పేర్కొన్నారు.

గతంలో వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్‌లాగే, ‘దిమాగీ నక్సల్ పార్టీ’ పేరుతో మీమ్స్, వ్యంగ్య పోస్టులు వైరల్ అవుతూ వేలాది మంది ఫాలోవర్లను సంపాదిస్తున్నాయి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలో గంట గంటకు ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. ప్రశ్నించే వాళ్లు దిమాగీ నక్సల్స్ అవుతారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ‘దిమాగీ నక్సల్స్’ పేజీకి పోస్టులు పెడుతున్నారు. ‘దిమాగీ నక్సల్ పార్టీ’ వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత లేదు.

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలో సాయుధ నక్సలిజం అంతమైందని.. ఆ స్థానంలో దిమాగీ నక్సల్స్ పొంచి ఉన్నారంటూ మోదీ కామెంట్స్ చేశారు. ఆయుధాలు పట్టిన నక్సలైట్లను ప్రభుత్వం మట్టుబెట్టినా, ఆ సిద్ధాంతాన్ని సమర్థించే కొందరు ‘దిమాగీ నక్సల్స్’ ఇంకా వ్యవస్థలో ఉంటూ యువతను భ్రమల్లోకి నెడుతున్నారని ప్రధాని హెచ్చరించారు. అటువంటి వారిని గుర్తించి సమాజం నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. “వామపక్ష తీవ్రవాదం (లేదా నక్సల్) లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసింది. అనేక దశాబ్దాలుగా నక్సల్ హింస దేశంలోని పెద్ద భాగాన్ని తుపాకీ గుప్పిట్లో ఉంచుకుంది” అని ప్రధాని ఆగస్టు 15 నాటి ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలను ప్రధాని నైరాశ్యానికి నిదర్శనంగా అభివర్ణించారు.

‘దిమాగీ నక్సల్’ అని పిలిచినా గర్వపడతానంటూ సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కూడా ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. “ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన చదువుకున్న యువతపై ‘నక్సలైట్లు’ అని ముద్ర వేయడం తీవ్ర అహంకారానికి, సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం” అని సౌరవ్ దాస్ ఆరోపించారు. మావోయిస్టులు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారినే ఉద్దేశించి మాత్రమే ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు చేశారని, ప్రతిపక్షాలను ఉద్దేశించి కాదని ఇప్పటికే మోదీ ఇలా అన్నారని ఇప్పటికే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు.