దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన కాక్రోచ్ జనతా పార్టీ ఎట్టకేలకు తొలి కార్యాచరణ ప్రకటించింది. నీట్ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై స్పందిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. ఇందుకోసం ఈ నెల 6న నిర్వహించనున్న శాంతియుత ధర్నాలో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ధర్నాలో పాల్గొనేందుకు తాను ఇండియాకు తిరిగి వస్తున్నానని అభిజిత్ దీప్కే తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఢిల్లీలో చేపట్టనున్న ఈ నిరసనలో విద్యార్థులు, తన మద్దతుదారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జూన్ 6న ఢిల్లీకి వద్దామని అనుకుంటున్నానని, ఎయిర్‌పోర్టుకు మీరందరూ రావాలి. అక్కడి నుంచి మనం పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శాంతియుత నిరసన కార్యక్రమం కోసం అనుమతి తీసుకుందాం. జంతర్‌మంతర్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపడదాము’ అని దీప్కే చెప్పారు. పరీక్ష నిర్వహణలో లోపాలు, అవాంతరాల కారణంగా విద్యార్థులు ఆందోళనలో కూరుకుపోయారని అభిజీత్ అన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
మనందరం ఏకమయ్యేందుకు టైమ్ వచ్చిందని, రాజ్యాంగం చూపించిన దారిలో ముందుకు సాగుతూ శాంతియుత మార్గంలో గొంతెత్తాలని దీప్కే యువతను కోరారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. కలిసికట్టుగా ముందడుగు వేస్తే వాళ్లు మన మాట వినకతప్పదు అని తన వీడియోలో పేర్కొన్నారు.
జెన్ జీ ఉద్యమ సంకేతంగా.. కాక్రోచ్ జనతా పార్టీ
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై విచారణ సందర్భంగా..నిరుద్యోగులను ‘బొద్దింకలు, సోమరిపోతులు’ అంటూ సంబోధించిన సీజేఐ సూర్యకాంత్ చేసిన బొద్దింకలు, సోమరిపోతులు వ్యాఖ్యలను నిరసిస్తూ .. 30 ఏళ్ల అభిజీత్ దిప్కే అనే యువకుడు మే 16వ తేదీన ఓ వ్యంగ్య రాజకీయ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఒక పేజీని డిజిటల్ మాధ్యమాల్లో ప్రారంభించారు. ఓ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. ఈ ఉద్యమానికి సోషల్ మీడియాలో నెటిజన్లు, యువత మద్దతుగా “నేనూ బొద్దింకనే” అంటూ కోట్లాది మంది సభ్యులుగా చేరారు. యువత పడుతున్న నిరుద్యోగ బాధను, ప్రభుత్వాల వైఫల్యాలను, ఉద్యోగ అవకాశాల కొరతను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మీమ్స్ చేయడమే లక్ష్యంగా మొదలైన కాక్రోచ్ పార్టీకి కొద్ది రోజుల్లోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మించి ఏకంగా 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ చేరిపోయారు. ఓ రకంగా భారత్ లో జెన్ జీ ఉద్యమానికి సంకేతంగా కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ నిలిచిందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పడంతో ఈ పార్టీకి జనాల్లో అమాంతంగా క్రేజ్ పెరిగిపోయింది.
దేశ భద్రతా కారణాల వల్ల మొదట ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఆ తర్వాత అది Cockroach is Back అనే పేరుతో మళ్లీ వచ్చింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ఆ పార్టీ స్థాపకుడికి రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈనెల 6న ఇండియాకు వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేస్తారా.. వదిలేస్తారా…ధర్నాకు అనుమతి ఇస్తారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
6 जून को कॉकरोच जनता पार्टी के संस्थापक अभिषेक दीपके भारत आ रहे हैं। अभिषेक दीपके ने वीडियो शेयर कर जानकारी दी और कहा कि शिक्षा मंत्री के इस्तीफे की मांग को लेकर दिल्ली के जंतर-मंतर पर शांतिपूर्ण प्रदर्शन किया जाएगा।
.
.#abhishekdeepke #CJP #newsupdate pic.twitter.com/VyjgXBH9xs— Article19 India (@Article19_India) June 1, 2026