అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో తన చదువు, దానికైన ఖర్చులపై వచ్చిన ప్రశ్నలపై కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా చదువులకు కుటుంబంపై ఆధారపడలేదని వివరించారు. బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చిన స్కాలర్‌షిప్‌తో పాటు విద్యా రుణం ద్వారా చదువు పూర్తి చేసినట్లు స్పష్టత ఇచ్చారు. తీసుకున్న విద్యారుణాన్ని ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నానని కూడా దీప్కే తెలిపారు. సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఇటీవల దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని పలు సంస్థలను కోరిన సంగతి తెలిసిందే.
నా స్కాలర్‌షిప్ లెటర్, ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్స్ చూపించడానికి నేను రెడీ! అని, మరి మన ‘చక్రవర్తి(మోదీ)’ తన డిగ్రీని చూపిస్తారా?” అంటూ సవాల్ విసిరారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి విదేశాల్లో చదువుకుంటే ఇంతటి విచారణ, రచ్చ ఎందుకని కూడా ప్రశ్నించారు. అభిజీత్ దీప్కే తమ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి పబ్లిక్ రిలేషన్స్‌లో..మాస్టర్స్ పూర్తి చేసిన తమ ఓల్డ్ స్టూడెంట్ అని బోస్టన్ యూనివర్సిటీ కూడా స్వయంగా కన్ఫర్మ్ చేయడం విశేషం.
సీజేపీ నిధులపై వివరణ..
సీజేపీ నిధులపై వస్తున్న ప్రశ్నలకూ దీప్కే ఈ సందర్భంగా సమాధానమిచ్చారు. భవిష్యత్తులో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామన్నారు. ప్రతి రూపాయి లెక్కను పారదర్శకంగా వెల్లడిస్తామని చెప్పారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సమయంలో ప్రజలే ఆహారం, తాగునీరు అందించి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనల తర్వాత తమ పార్టీపై బాధ్యత మరింత పెరిగిందని అభిజీత్ దీప్కే అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే సీజేపీ కమిటీలను విస్తరిస్తామని తెలిపారు. దేశంలో విద్య సామాన్య ప్రజలకు అందనంత ఖరీదుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి వంటి అంశాలపై రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు.
దీప్కే చదువు ఖర్చులపై వచ్చిన ప్రశ్నలపై సీజేపీ ప్రతినిధి వైష్ణవి గౌర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై సమాచారం కోరిన ఆర్టీఐ కార్యకర్తపై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత విద్యా ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తేవారు.. ఇతర నిధుల దుర్వినియోగంపై ఎందుకు దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.
I am ready to reveal my scholarship letter & education loan letter.
Will the emperor show his degree? pic.twitter.com/cVUqbz3O9n
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 3, 2026