నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాక విజయవంతమైన ఉద్యమం నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తమ తదుపరి కార్యాచరణను ప్రకటించింది. ఇకపై ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా యువత ఆశయాలు, అంచనాలు, ఆందోళనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామని దీప్కే తెలిపారు. నిరుద్యోగం ప్రధాన సమస్య అని, దానిని జాతీయ అంశంగా మారుస్తామని సీజేపీ కీలక నేతలు తెలిపారు.
రెండు రోజుల పార్టీ చర్చల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్‌లో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించిందని, ఆ కార్యక్రమం పేరు ‘క్యా బోల్తీ పబ్లిక్’” అని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ నుంచి పార్టీ దేశమంతా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుందని, నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను తమ రాజకీయ కార్యాచరణలో ప్రధానంగా నిలుపుతామని చెప్పారు. భారత జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని, అయినా ఈ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు అన్నారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అందుకే మేము ప్రజల వద్దకు వెళ్లి…యువత అంచనాలను తెలుసుకుంటామని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వింటాం అని చెప్పారు.
డిగ్రీలు సంపాదించినా పెద్ద సంఖ్యలో చదువుకున్న యువత నిరుద్యోగులుగానే ఉన్నారని దిప్కే అన్నారు. “డిగ్రీ సంపాదించిన తర్వాత కూడా దేశ యువతలో దాదాపు 80 శాతం మంది నిరుద్యోగులుగానే ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. చదువు పూర్తి చేయని వారు లేదా డిగ్రీలు లేని వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. చదువుకున్న యువత భవిష్యత్తుపై డిగ్రీలు లేని వారు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.
గత నెల న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని జెన్ జీ ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచారని, ఆ ఉద్యమం ఫలితంగా అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా మారకుండానే సీజేపీ కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగాన్ని జాతీయ అంశంగా మార్చాలనుకుంటున్నామని, ప్రభుత్వంగా మీరు నిరుద్యోగ సంక్షోభాన్ని ఇక నిర్లక్ష్యం చేయలేరని ఆయన తెలిపారు.
సీజేపీ పార్టీ సిద్ధాంతం భారత రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఉంటుంది. మేము లౌకికవాదులం. ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం. మేము ప్రజాస్వామ్యవాదులం. సామాజిక న్యాయం దిశగా పని చేస్తూనే ఉంటాం” అని అన్నారు. మహాత్మా గాంధీ శాంతి, అహింస సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయ దృక్పథం, జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత స్వప్నం మాకు స్ఫూర్తిగా నిలుస్తాయి” అని చెప్పారు. ఇటీవలి రాజకీయ మార్పులకు విద్యార్థులే కారణమని దిప్కే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలకు ముందు దేశం చాలా ఏళ్ల పాటు అణచివేత, నిరంకుశ పాలనను చూసిందని ఆరోపించారు.