డిపాజిట్లు, ఖాతాలు ఉపసంహరించుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి ఎస్బీఐ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు ఆరోపించారు. ఎస్బీఐకి కేటాయించిన భూమి వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బ్యాంకును లక్ష్యంగా చేసుకోవడం సరికాదని విమర్శించారు. రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే పగబడతాడని, ఎస్బీఐ తర్వాత ఆర్బీఐ,వరల్డ్ బ్యాంక్ కూడా ప్రశ్నిస్తే వాటినీ నిషేధిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. అన్నింటిని నిషేధించి కొత్తగా కొండల్ రెడ్డి బ్యాంక్ పెడతారేమోనని, పైసల్ మస్తుగా పోగయ్యాయని విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, సన్న ధాన్యానికి బోనస్, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్తు అందిస్తామని చెప్పి ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని హరీశ్ రావు విమర్శించారు. నాలుగు నెలలుగా రైతు బీమా ఆగిపోయిందని, ,7600మంది రైతు బీమా కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రైతు భరోసా మూడు దఫాలుగా ఎగవేశాడని, ఒక పంటకు మొత్తానికి, మరో పంటకు మూడెకరాలకే ఇచ్చాడని, ఇంకో పంటకు రెండెకరాలకే ఇచ్చాడని, మొత్తం 29,300కోట్లు రైతులకు బకాయిలు పడ్డాడని హరీశ్ రావు వెల్లడించారు. రేవంత్ రెడ్డి అబద్దాలకు అంబాసిడర్ గా, ఎనుముల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారిపోయాడని హరీశ్ రావు విమర్శించారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాటలు తప్పిన ఘనుడు రేవంత్ అని ఎద్దేవా చేశారు. కేంద్రం చెప్పిన మేరకే ధాన్యం, చెప్పిన పంటలు మాత్రమే కొంటానంటూ వాటిని పండించిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు.
పథకాలకు పైసల్ లేవు.. క్యాంపు ఆఫీస్ లకు మాత్రం ఉంటాయా..
ఎస్సీ, ఎస్టీ,బీసీలకు బడ్జెట్ లో భారీ కేటాయింపులు చూపించి..ఖర్చు మాత్రం చేయకుండా ఆ వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఆయా వర్గాల ప్రజలకు అమలు చేసిన పథకాలన్నింటిని రేవంత్ రెడ్డి నిలిపివేసి మరింత అన్యాయం చేశాడని విమర్శించారు.పైసలు లేక ఇస్తాలేడా..లేక రేవంత్ రెడ్డికి మనసు లేక ఆ వర్గాలకు నిధులు, పథకాలు ఇవ్వడం లేదా ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన ఇంటి పక్కన ఎంసీహెచ్ఆర్డీలో రూ.100కోట్లతో క్యాంపు ఆఫీస్ కట్టుకున్నాడని, అధికారంలోకి రాగానే ఇనుప కంచెలు ఎత్తివేస్తునామని చెప్పుకుని, ఇప్పుడు ఆ క్యాంపు ఆఫీస్ చుట్టు రూ. 17కోట్లతో ఇనుప కంచెలు నిర్మించుకున్నాడని ఆరోపించారు.
సెక్రటేరియట్ కు పోకుండా ఎంసీహెచ్ఆర్డీ లో ఒకటి, పోలీస్ కంట్రోల్ రూమ్ లో మరోకటి, ఫ్యూచర్ సిటీ లో మరో క్యాంపు ఆఫీసులను వందల కోట్లతో కట్టేందుకు పైసలు ఉంటాయిగాని, పేద వర్గాలకు పథకాల అమలుకు మాత్రం పైసలు లేవంటున్నాడని హరీశ్ రావు గుర్తు చేశారు. మూసీ సుందరీకరణకు,అందాల పోటీలకు, ఫ్యూచర్ సిటీకి, రోడ్లకు, మనుమడితో ఫుట్ బాల్ ఆడేందుకు, క్యాంపు ఆఫీసులకు డబ్బులు ఖర్చు పెడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, విద్యార్ధులకు మాత్రం నిధులు ఇవ్వడం లేదని హరీశ్ రావు ఆరోపించారు.
కాంగ్రెస్ స్కామ్ ల పాలన..
రేవంత్ రెడ్డి మోసాలపై, హామీల అమలుపై నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నాడని, అటువంటి వారిని మేం అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమున్నారు. కేసీఆర్ స్కీమ్ ల పాలన చేస్తే.. కాంగ్రెస్ పాలన అంతా ఇప్పుడు సింగరేణి స్కామ్, పవర్ స్కామ్, హ్యామ్ రోడ్ల స్కామ్, బొగ్గు స్కామ్, గురుకుల టెండర్ల స్కామ్, హిల్ట్ పాలసీ స్కామ్, భూముల స్కామ్ లతో రోజుకొక స్కామ్ లతో సాగుతుందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు..
కేంద్రం పెంచిన దానికి అదనంగా రేవంత్ రెడ్డి పెట్రోల్ పై అదనంగా రూ. 2వేల కోట్లు భారం ప్రజలపై వేశాడని, మద్యం ధరలు పెంచారని, రిజిస్ట్రేషన్ ఫీజులు, భూముల ధరలు పెంచారని, ఎరువుల ధరలు పెంచారని, రవాణ శాఖ నుంచి చార్జీలు పెంచారని, ఇప్పుడు భూమి శిస్తు మళ్లీ తెస్తామంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ భూమిశిస్తు, నీటి తీరువా, చెట్టు పన్ను, ఎత్తిపోతల చార్జీలు రద్దు చేసి..రైతులకు అదనంగా రైతు బంధు ఇచ్చాడని, గౌడన్నలకు మద్యం టెండర్లలో రిజర్వేషన్లు తెచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన చూస్తే ఆయనొక హిట్లర్, తుగ్లక్, ఔరంగ జేబు పద్దతిలో కొనసాగుతుందన్నారు. హిట్లర్ తప్పులకు ఇప్పటికి జర్మనీ దేశం క్షమాపణ చెబుతుంటే..నాకు హిట్లర్ ఆదర్శం అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని, అటువంటి రేవంత్ రెడ్డికి ఓటమి ఖాయం అని, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనకు కాంగ్రెస్ పార్టీ మరో 50ఏళ్లు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పెండింగ్ ప్రాజెక్టులు ఒక్కటి పూర్తికాకపోగా…పక్క రాష్ట్రం జలదోపిడికి సహకరిస్తుందని హరీశ్ రావు విమర్శించారు.