Siddaramaiah | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సోషలిస్టుగా నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సిద్ధరామయ్య అంచెలంచెలుగా ఎదిగి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే స్థాయికి ఎదిగారు. బీసీ కులానికి చెందిన సిద్ధరామయ్య జీవితంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత అదే పార్టీలో చేరి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. పశువుల కాపరి నుంచి పరిపాలించే స్థాయికి ఎదిగిన సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం తెలుసుకుందాం..
కర్ణాటక మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండీలో 1948, ఆగస్టు 12వ తేదీన సిద్ధరామయ్య జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన.. పదేండ్ల వయసుకు వరకు పాఠశాల అంటే ఏంటో తెలియదు. తమకున్న పొలంలోనే పనులు చేసుకుంటూ, పశువులను కాసేవారు. ఆ తర్వాత కొన్నేండ్లకు డిగ్రీ పూర్తి చేశారు. మైసూర్ యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్నారు. ఇక న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకున్న సిద్ధరామయ్య.. మైసూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1978లో జిల్లా కోర్టులో ఆయనకు నంజుండస్వామి పరిచయం కావడంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. సోషలిస్టు భావజాలంతో పెరిగిన సిద్ధరామయ్యపై రామ్ మనోహర్ లోహియా ప్రభావం ఉంది.
1983లో తొలిసారిగా ఎమ్మెల్యే గెలుపు
75 ఏళ్ల సిద్ధరామయ్యకు రాజకీయాల్లో 45 ఏళ్ల అనుభవం ఉంది. సిద్ధరామయ్యది బీసీకి చెందిన కురబ కులం. కర్ణాటకలో కురబల జనాభా సుమారు 9 శాతం. బీసీల్లో మంచి పట్టున్న నేతగా సిద్ధరామయ్యను చూస్తారు. 1983లో తొలిసారి చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ గెలుపుతో పాత మైసూరు ప్రాంతంలో సిద్ధరామయ్యకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది.
ఆ తరువాత ఆయన జనతా పార్టీలో చేరారు.
జనతా ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు
1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ 139 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. నాటి ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందిన సిద్ధరామయ్య.. రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1994లో దేవేగౌడ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలోకి రాగా, నాడు సిద్ధరామయ్యకు ఆర్థిక శాఖ మంత్రి పదవి వరించింది. 1996లో జయదేవప్ప హలప్ప పటేల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా, సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా నియామకం అయ్యారు.
2005లో జేడీఎస్ నుంచి బహిష్కరణ
జనతా పార్టీ నుంచి దేవేగౌడ వర్గం బయటకు వెళ్లిపోయింది. తదనంతరం దేవేగౌడ జనతా దళ్(సెక్యులర్) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. సిద్ధరామయ్య కూడా దేవేగౌడతో ప్రయాణించారు. 2004లో కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉపముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు. అయితే ఒకానొక సమయంలో దేవేగౌడ, సిద్ధరామయ్య మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. నంబర్ 2గా ఉన్న సిద్ధరామయ్యను తన కుమారుడు కుమారస్వామి కోసం దేవేగౌడ పక్కన పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు జేడీఎస్ నుంచి 2005లో సిద్ధరామయ్యను బహిష్కరించారు.
కాంగ్రెస్‌లో చేరి, ఉప ఎన్నికలో గెలిచిన సిద్ధరామయ్య
జేడీఎస్ నుంచి బహిష్కరణకు గురైన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో సిద్ధరామయ్య గెలిచారు.
2013లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం
2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు నడిపిన సిద్ధరామయ్య తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు సిద్ధరామయ్య.