- తాను గెలిస్తే పాలిచ్చే బర్రె.. ఎదుటోడు గెలిస్తే దున్నపోతు
- ప్రతిపక్ష నేత ప్రజాతీర్పుకిచ్చిన విలువ అదేనా
- మాటలలో నల్లగొండ జనం నీళ్ల కష్టాలు
- చేతల్లో పదేళ్లుగా జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయని నిర్వాకం
- నాడు వారిది పసికూన ప్రభుత్వం.. నేడు వీరిది దద్దమ్మల ప్రభుత్వం
- కుంగిన నాటి నుంచి మేడిగడ్డ ఊసెత్తరు..నచ్చని అంశాలన్నిటిపై అదే తీరు
- తన హయాంలో ప్రతిపక్షాలకు అపాయింట్ మెంట్ ఇవ్వరు
- ఇప్పుడు అఖిల పక్షం తీసుకెళ్లమంటారు
- కేసీఆర్ మాటలపై జోరుగా రచ్చబండ చర్చలు
- అవినీతి ఆరోపణలపై నోరు మెదపని తీరుపై సందేహాలు
విధాత : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయాక, ఆసుపత్రి పాలై కోలుకుని జనంలోకి వచ్చాకా నల్లగొండ సభలో ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు జనంలో చర్చనీయాంశంగా మారింది.
జనం దృష్టిని ఆకర్షించేలా మాట్లాడటంలో దిట్ట అయిన కేసీఆర్ మరోసారి ఆనాటి తెలంగాణ ఉద్యమనేత తరహాలో రెండునెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల తూటాలే పేల్చారు. తనకు అచ్చొచ్చిన తెలంగాణ సెంటిమెంట్..ఉద్యమ ట్యాగ్‌లైన్ నినాదాల్లో ఒకటైన నీళ్ల సమస్యను ఆసరాగా చేసుకుని ప్రభుత్వంపై మాటల దాడి సాగించారు. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో తాను నిన్నటిదాకా రాష్ట్రాన్ని దాదాపు పదేళ్లు పాలించిన మాజీ సీఎంను అని, ప్రస్తుత ప్రతిపక్ష నేతనన్న నేపద్యం మరిచి తనదైన శైలిలో విరుచకు పడుతూ చేసిన విమర్శలలో తిరిగి అన్ని తనకే తగులుతాయన్న లాజిక్‌ను మిస్ కావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రధానంగా రెట్టింపు వేగంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం… అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పాలకుల పరిపాలన సవ్యంగా లేకపోతే ప్రజా తీర్పు తిరిగి బీఆరెస్‌కు అనుకూలంగా ఉంటుందనడంలో ఎవరికీ సందేహాలు లేవు. షెడ్ కి వెళ్ళిన కారు డబుల్, త్రిబుల్ స్పీడ్‌తో తిరిగి అధికార రహదారిపై దూసుకరావచ్చు. అదే ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ విమర్శించడమే ఇక్కడ ఆయన విజ్ఞతను ప్రశ్నార్ధకం చేస్తుంది.
నల్లగొండ సభలో తెలంగాణ ప్రజలనుద్దేశించి మీకు ఏమైందో ఏమో.. ఏ భ్రమలకు లోనయ్యారో గాని పాలిచ్చే బర్రెను కాదనుకొని దున్నపోతును తెచ్చుకున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి కేసీఆర్ మాట్లాడిన మాటలు ప్రజా తీర్పును, ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసేదిగా ఉన్నాయి. తాను గెలిస్తే పాలిచ్చే బర్రె..ప్రతిపక్షం గెలిస్తే దున్నపోతు అన్న వైఖరితో చేసిన కేసీఆర్ మాటలలో విజ్ఞత ఎంతో ఆయనకే తెలియాలి. ఆ మాటల వెనుక ప్రజలు ఆయనను తిరస్కరించారన్న అంతర్మథనం ఆవేధన కంటే అక్కసు, అసహనమే ఎక్కువగా వ్యక్తమైంది.
అధికారంలో ఉన్నప్పుడు నిధులివ్వకుండా…ఇప్పుడు పోరాటాలా
ఇక నల్లగొండ నుంచే నీళ్ల హక్కుల పోరాటం ఆరంభమైందన్న కేసీఆర్ తాను అధికారంలో ఉన్న పదేళ్లలో ఈ జిల్లాకు చెందిన ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు, ఉదయ సముద్రం, డిండి ఎత్తిపోతల, మూసీ కాలువల విస్తరణ, ఉప ఎన్నికలలో ప్రకటించిన పలు లిఫ్ట్‌ల పనులకు సంబంధించి నిధులివ్వకుండా తాను చేసిన నిర్లక్ష్యాన్ని మాత్రం మరిచిపోవడం విడ్డూరమే. నీళ్లు లేకపోతే బతుకే లేదని, నీళ్ల పోరాటం మన జీవన్మరణ పోరాటమన్న కేసీఆర్ నల్లగొండ పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయించలేక పోయారన్నదానిపై సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కాలు విరిగినా కట్టె పట్టుకుని మీకోసం కొట్లాడేందుకు వచ్చానని, నాకట్టె కాలే వరకు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతానన్న కేసీఆర్ తాను అధికారంలో ఉండగా నల్లగొండ వాసులకు ఆ కష్టాలేవీ లేకుండా నల్లగొండ ప్రజలకు జీవాధారమైన ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు సహా ఇతర జిల్లా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయించలేకపోయారన్న ప్రశ్న జనం మదిలో రగలకమానదు. తనకు రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశాల ఊసేత్తకుండా తనకు రాజకీయ లబ్ధిని చేకూర్చే అంశాలనే ప్రజల మదిలోకి చెప్పించడంలో మరోసారి తన మాటల చాతుర్యాన్ని నల్గొండ వేదికగా కేసీఆర్ ప్రదర్శించారనడంలో సందేహం లేదు.
ఆయన హామీలకు ఏండ్లు కావాలి..వీరు నెలల్లోనే తీర్చాలి
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఊరుకోమని వెంటాడుతామని, బతకనీయమని కేసీఆర్ రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఇదే సందర్భంలో తాను ఉద్యమ కాలంలోనూ, పదేళ్ల తన పాలనా కాలంలో రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఏండ్ల తరబడి ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్న తన ఎదుటి పక్షం నుంచి ఎదురవుతుందన్న కనీస సోయి విస్మరించారు. తాను ఎస్ఎల్బీసీ కట్టపై కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన హామీతో పాటు డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామన్న హామీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల హామీలను పదేళ్ల పరిపాలనలో కూడా నెరవేర్చని కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఎంతగా వెంటాడాలో ఆయనకే తెలియాలి. వేటాడు..వెంటాడు సాధ్యం కాని జనం ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్దతిలో నిశ్శబ్ధ విప్లవంతో మార్పును తెస్తారన్న సంగతి విదితమే.
రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీలపై వెంటాడితే పదేళ్ల కేసీఆర్ పరిపాలన వైఫల్యాలపై ఆనాటి ప్రతిపక్షాలు ఏమనాలో ఎంతటి స్థాయిలో స్పందించాలో ఊహించవచ్చు. అయితే ప్రతిపక్షాలను స్వేచ్ఛగా ధర్నాలు కూడా చేసుకొనివ్వకుండా, హౌజ్ అరెస్టులు చేసి, తన తెలంగాణ ఉద్యమానికి వేదికైన ధర్నా పార్కును ఎత్తివేసి, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడాఇవ్వకుండా చేసిన అణిచివేత విధానాలను కేసీఆర్ మరిచినా జనం ఇంకా మరువలేదనే చెప్పవచ్చు. కేసీఆర్ రైతులకిచ్చిన లక్ష రుణమాఫీ ఐదేళ్ల పాలనా చివరి కాలం వరకు అమలు చేయని వైనం జనం స్మృృతిలోనే ఉంది.
నాడు వారిది పసికూన ప్రభుత్వం… నేడు వీరిది దద్దమ్మల ప్రభుత్వం
కాంగ్రెస్ పాలన దద్దమ్మల, సన్యాసుల పాలన, అసమర్థుల పాలన అంటూ కేసీఆర్ నల్లగొండ సభలో తనదైన భాషలో విమర్శించారు. రెండు నెలలకే కాంగ్రెస్ పాలకుల పాలన అంత అద్వాన్నంగా ఉంటే పదేళ్ల కేసీఆర్ పాలనలో చోటుచేసుకున్న ఎన్నో వైఫల్యాలపై ప్రజల్లో రేగిన అసంతృప్తి ఎన్నికల్లో బీఆరెస్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చేలా చేసిందనడంలో తప్పులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వారికి పాలనానుభవం లేదని, హామీలను అమలు చేయడం లేదని ఆనాటి ప్రతిపక్షాలు విమర్శిస్తే కొత్త రాష్ట్రంలో.. పసికూన లాంటి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అంటు కేసీఆర్ తప్పుబట్టారు. అదే కేసీఆర్ ఇప్పుడు రెండు నెలల రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై అంతెత్తునా ఎగిరిపడటం ఆయనలోని అక్కసునే చాటుతుందంటున్నారు విశ్లేషకులు.
నాడు ప్రతిపక్షాలను లెక్క చేయలేదు..నేడు అఖిల పక్షం అంటున్నారు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కుల సాధనకు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలంటూ డిమాండ్ చేస్తున్న కేసీఆర్ వైఖరి ఇప్పుడు మరింత విమర్శనాత్మకంగా మారింది. పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా.. ప్రగతిభవన్‌లోకి రానివ్వకుండా..అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా, నిరసనలు చేసుకోనివ్వకుండా నిరంకుశ వైఖరి ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంగా తాను చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించాలంటూ పట్టుబడుతుండటం విడ్డూరం. విభజన హామీల సాధనకు ఎన్నో సార్లు ప్రతిపక్షాలు కేసీఆర్‌ను ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేసినా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు అదే డిమాండ్‌ను వినిపించడం కర్మ ఫలమే అనుకోవచ్చు.
అదిగాక తెలంగాణ నీటి వాటాల కోసం ఎంతదాకైనా కొట్లాడుదామంటూ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అందుకోసం అఖిల పక్షం తీసుకెళ్లాలన్న ఆలోచన ఎందుకు రాలేదన్నదానికి సమాధానం ఆయనే చెప్పాలి. అదిగాక తనకు కోపం రాగానే ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ధరల పెరుగుదలపైన, అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అమెరికాలో విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలపైన అధికారంలో ఉండికూడా నిరసనలకు పిలుపునిచ్చిన కేసీఆర్ పదేళ్లలో కృష్ణా జలాల సాధన కోసం నిరసనలకు పిలుపునివ్వకపోవడం విస్మయకరమే. తాను పిలుపిస్తే పులిలా కొట్లాడేందుకు తరలిరావాలని సద్ది మూటలు కట్టుకొని ఎన్ని రోజులైనా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన కేసీఆర్ అదే జనం సద్ది మూటలు కట్టుకొని తన ప్రగతి భవన్ చుట్టూ తిరిగినా వారికి దర్శన భాగ్యం కల్పించకపోవడం గమనార్హం.
కృష్ణా ప్రాజెక్టులను అప్పగించబోమంటూ అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన తీర్మానం తెలివి తక్కువగా ఉందని మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తాను అదే తీర్మానంపై చర్చలో పాల్గొనే అవకాశాన్ని ఎందుకు కాలదన్నాడో ఆయనకే తెలియాలి. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాడు.. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాడు అన్నట్లుగా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి ఆయన అహంభావాన్నే తలపిస్తుందన్న విమర్శలకు ఆయనే ఊతమిస్తున్నారంటున్నారని విశ్లేషకులు.
విమర్శలపై కప్పదాట్లు…పిల్లిమొగ్గలు
మేడిగడ్డకు పోయి సీఎం ఏం పీకుతారు అంటూ మాట్లాడిన కేసీఆర్ తన హయాంలో బస్సులు పెట్టి మరి జనాన్ని అక్కడికి ఎందుకు తీసుకెళ్లారన్న ప్రశ్న తలెత్తకమానదు. మేడిగడ్డలోని లోపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ మరమ్మతుల కోసం అధికారులు లేఖలు రాస్తుంటే తమ లోపాలు బహిర్గతమవుతాయన్న భయంతో అప్పటిదాకా సందర్శన కేంద్రంగా ఉన్న మేడిగడ్డ అకస్మాత్తుగా నిషేధిత ప్రాంతమైపోయిందన్న ప్రతిపక్షాల మాటల్లో ఔచిత్యం కాదనలేనిదే. మేడిగడ్డకు వెళ్లి పీకేదేముందంటూ కేసీఆర్.. ఒకటి రెండు పిల్లర్స్ కి క్రాక్స్ వస్తే అంత గగ్గోలు ఎందుకంటూ కేటీఆర్, మేడిగడ్డపైన అధికార పక్షం కోడిగుడ్డుపై ఈకలు పీకుతుదంటూ హరీశ్‌రావులు మాట్లాడుతున్న మాటలు ఆ బ్యారేజీ కుంగుబాటు సమస్యను చిన్నదిగా చేసే చూపుతున్నాయి.
లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టులో..4వేలకోట్ల వ్యయంతో నిర్మించిన బ్యారేజీ కుంగుబాటు నిజంగా అది అంత చిన్న సమస్య అయితే కుంగుబాటు నుంచి నల్లగొండ సభ వరకు మేడిగడ్డపై కేసీఆర్ ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదన్నది వారికే తెలియాలి. కాళేశ్వరం ప్రాజెక్టు..మేడిగడ్డ డిజైనర్, ఇంజనీర్ కేసీఆర్ కావడంతో మేడిగడ్డ కుంగిపోతే మొదట స్పందించాల్సింది ఆయనే. అందుకు విరుద్దంగా మొదట బాంబు బ్లాస్టింగ్ అంటూ చిత్రమైన వాదనను బీఆరెస్ తెరపైకి తేవడం..అంతకుముందు గోదావరి వరదల్లో పంప్‌హౌజ్‌లు మునిగిన సందర్భాల్లో విదేశాల క్లౌడ్ బరెస్టు అంటూ డైవర్షన్‌తో కూడిన మాటలు జనం ఇంకా మరవలేదనే చెప్పవచ్చు.
మేడిగడ్డ కుంగుబాటుపైన, కాళేశ్వరం అవినీతిపైన రెండు నెలలుగా కాంగ్రెస్, బీజేపీలు అనేక అవినీతి ఆరోపణలతో కేసీఆర్ లక్ష్యంగా దాడి చేస్తుంటే ఆయన స్పందించలేదు. సీతారామ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల అంచనాల పెంపు.. అంబేద్కర్ సచివాలయం, అమరవీరుల స్థూపంపైన తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నా స్పందించకపోవడం కేసీఆర్ నైజంగానే విశ్లేషకులు భావిస్తుంటారు.
తనకు నచ్చని, రాజకీయంగా ఇబ్బందికరమైన అంశాలపై స్పందించకపోవడం ఆయనకు కొత్తకాదు. ఇందుకు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశాలు, విద్యార్థుల ఆత్మహత్యల అంశాలు, నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ మేడిగడ్డ బ్యారేజీ పనికిరాదని, విజిలెన్స్, కాగ్‌లు కాళేశ్వరం నిర్మాణాల్లో అక్రమాలు సాగాలని నివేదికలిచ్చినా కేసీఆర్ స్పదించకపోవడమే నిదర్శనమంటున్నారు. కొత్తగా నల్లగొండ సభలో కుంగుబాటుకు గురైనా మేడిగడ్డలో కాపర్ డ్యాంతో నీళ్లు నింపొచ్చని, నింపి ఎత్తిపోయాలంటూ కొత్త చర్చకు తెరలేపడం కేసీఆర్‌కే సొంతమైన తెగింపు మాటలుగానే చూస్తున్నారు
చట్ట సభలను కాదని వీధి పోరాటాలా
కట్టె కాలే వరకు పులిలా కొట్లాడుతానంటున్న కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమి చేసినా ప్రజాస్వామిక ప్రభుత్వాలలో చట్టసభలలోనే అంతిమంగా నిర్ణయాలు చేయాలన్న సంగతి తెలియంది కాదు. అలాంటి కీలకమైన చట్టసభలకు ప్రతిపక్ష నేతగా హాజరుకాకుండా బయట బహిరంగ సభలలో పులిగర్జనలు చేయడం ఏమిటో ఆయనకే తెలియాలి. నిజానికి పులిలా కొట్లాడుతానంటున్న కేసీఆర్ తనను సీఎం రేవంత్‌రెడ్డి ఎంత కవ్విస్తున్నా అసెంబ్లీకి రాకుండా పిల్లి దాగుడుమూతలు వేయడం ఎందుకో తెలంగాణ సమాజానికి అర్ధంకాని వ్యవహారమే.అయితే ఉద్యమ కాలం నుంచి నిన్నటి నల్లగొండ సభ వరకు కేసీఆర్ చెప్పినట్లుగా నేటీ తెలంగాణ ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదూ..చైతన్యవంతమైన తెలంగాణ అన్న మాటలను ఎవరు కాదనలేరు.
నిజాం నిరుంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన చైతన్యం తెలంగాణకు సొంతం. ప్రశ్నించడం.. ఉద్యమించడం.. అణిచివేతపై.. అన్యాయాలపై.. వివక్షతపై తిరుగబడటం..స్వేచ్చ కోసం పోరాడటం తెలంగాణ నైజం. అందుకే తెలంగాణ కోసం సకల జనం ఉద్యమించారు. ఉద్యమ పార్టీగా గౌరవించి రెండుసార్లు బీఆరెస్‌కు అధికారమిచ్చారు. పాలనలో మార్పు కోరుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామిక తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజాగా మళ్లీ ఉద్యమ సెంటిమెంట్‌ను రాజేస్తూ నదీ జలాల సమస్యలను లెవనెత్తుతూ చేస్తున్న రాజకీయ పోరాటాన్ని తెలంగాణ ప్రజలు ఎంతమేరకు విశ్వసిస్తున్నారన్నది రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తేలనుంది.