Site icon vidhaatha

KCR | కాంగ్రెస్ ట్రాప్‌లో పడకండి.


KCR | విధాత, హైదరాబాద్: బీఆరెస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను కలవడంపై గులాబీ బాస్ కేసీఆర్ అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నేతల, మంత్రుల ట్రాప్‌లో పడకుండా బీఆరెస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా వ్యవహారించాలని ఏది చెబితే అది విని ట్రాప్‌లో పడవద్దని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హితవు పలికారు. గురువారం అసెంబ్లీకి వచ్చి స్పీకర్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బీఆరెస్ ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జూబ్లిహీల్స్ నందిని నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేక భేటీ నిర్వహించారు.


రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతున్న తీరు, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అనుసరిస్తున్న వ్యూహాలు, బీఆరెస్ తీసుకోవాల్సిన వైఖరులపై ఆయన వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల బీఆరెస్ ఎమ్మెల్యేలు పలువురు సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను కలవడంపై పెదవి విప్పారు. అభివృద్ధి కోసం సీఎం, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండని, అయితే అది కూడా పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చి కలవాలని, మంత్రులు జనం మధ్యలో ఉన్నప్పుడే వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.


మీరు మంచి ఆలోచనలతో ప్రభుత్వంలోని వారిని కలిసినప్పటికి పార్టీ మారుతున్నారన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని హెచ్చరించారు. అలాంటి ప్రచారానికి అవకాశమివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని, ఏదో చెబితే విని అధికార పార్టీ ట్రాప్‌లో పడొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు తీరు..పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్ణయాలతో పాటు బీఆరెస్‌పై కాంగ్రెస్ నేతల విమర్శలపై ఈ సందర్భంగా కేసీఆర్ వారితో చర్చించారు.


బీఆరెస్ పాలనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఇటు ప్రజాక్షేత్రంలో, అటు రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎలా తిప్పికొట్టాలన్న దానిపై కూడా పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేశారు. తాను వీలైనంత త్వరగానే ప్రజాక్షేత్రంలోకి వస్తానని, పార్టీకి తప్పకుండా తిరిగి ప్రజల మద్దతు లభిస్తుందని, ధైర్యంగా లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని వారికి సూచించినట్లుగా సమాచారం. బీఆరెస్‌ను బొంద పెడుతామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.


మీరు ఎవరు భయపడాల్సిన పనిలేదని, సర్వేల్లో లోక్‌సభ ఎన్నికల్లో 7నుంచి 8 స్థానాలు బీఆరెస్ గెలవబోతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, పార్లమెంటు ఎన్నికల దాకా హామీలను సాగతీసే అవకాశముందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అన్నది వాళ్ల చేతుల్లోనే ఉందన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తామని, వారంలో రెండు రోజులు కార్యకర్తలను కలుస్తానన్నారు.

Exit mobile version