రేపు మూడు జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు

  • Publish Date - March 30, 2024 / 05:31 AM IST

  • రైతులను పరామర్శించనున్న కేసీఆర్


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు. అధికార పక్షాన్ని ఇరుకును పెట్టేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టడంతో పాటు కరువుతో ఇబ్బందుల పాలవుతున్న రైతాంగాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న సందర్భంలో కేసీఆర్ ఎండిన పొలాలను సందర్శించేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్లు రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని చేపట్టారు.


తాజాగా కేసీఆర్ ఆదివారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొలాల పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో చూస్తున్న నీటి కొరతకు ప్రకృతి కారణం కాదని, పాలక పక్షమే కారణమని మండిపడ్డారు.

Latest News