విధాత: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వానికి కన్ను ముక్కు చెవులు కూడా వలంటీర్లే అయ్యారు.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి సామాజిక పరిస్థితుల మీద ప్రభుత్వానికి వివరాలు అందించే వరకూ ఈ వలంటీర్లదే ప్రధాన భూమిక.
అయితే ఎన్నికల్లో వీళ్ళు ముఖ్యమైన పాత్ర పోషిస్తారో లేదో తెలీదు కానీ ముందస్తుగా ఎన్నికల అధికారి ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఈమేరకు ఎమ్ కే మీనా ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. వలంటీర్లతో ఎన్నికలకు సంబంధించి ఏ పనీ చేయించవద్దని జిల్లా ఎన్నికల అధికారులుగా ఉంటున్న కలెక్టర్లకు ఆయన ఆదేశించారు.
ప్రస్తుతం సాగుతున్న ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం కార్యక్రమానికి వీరిని దూరం పెట్టాలని కూడా సూచించినట్లుగా చెబుతున్నారు. అలాగే వాలంటీర్లు ఎవరైనా అభ్యర్ధులకు ఏజెంట్లుగా అసలు ఉండరాదని కూడా మీనా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా వీరిని పూర్తిగా పక్కన పెట్టాలని కోరారు.
వాలంటీర్ల వల్లనే తమకు మేలు జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వారిని దూరం పెట్టాల్సి రావడం కాస్త ఇబ్బందికరం అని భావిస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల వ్యవస్థ బలమైనది. ఈ వలంటీర్లు నేరుగా ప్రజలతో సంబంధాలు నెరుపుతూ ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు.
వీరిని ప్రభుత్వ కార్యక్రమాలకే కాకుండా పార్టీ కోసం కూడా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
స్థానిక ఎన్నికల్లో వారు కీలకంగా పని చేసారని, ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారు ముఖ్య భూమిక పోషిస్తారని ప్రతిపక్షాలు సైతం ఆందోళన చెందుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు వారి భయాన్ని తొలగిస్తూ ఇక ముందు వలంటీర్లతో ఎలాంటి ఎన్నికల పనులూ చేయించరాదని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మొత్తం 2.7 లక్షల మంది పని చేస్తున్నారు. వారంతా వైసీపీకి అనుకూలంగా ఉంటూ ప్రజలను బెదిరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమ పథకాలు దక్కవు అన్నట్లుగా
ప్రజలను బెదిరిస్తున్నారన్న సందేహాలూ ఉన్నాయి. దాంతో వారిని అన్నింటికీ దూరం పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.