Site icon vidhaatha

కుక్కల ప్రాణం.. మనిషి ప్రాణం.. దేనికి ఎక్కువ విలువ? కేరళ కోర్టు ఏమన్నదంటే..

కేరళ: జీవ హింస మహాపాపం అంటారు. మరి ఆ జీవాలు మనుషుల ప్రాణాలను హరించేవి అయినప్పుడు వాటిని చంపడం పాపమా? నేరమా? చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలను చంపుతుంటారు. కొన్ని వీధి కుక్కలు కరిస్తే ర్యాబిస్‌ అనే భయంకర వ్యాధి వస్తుంది. కుక్కలను చంపడం అనే అంశంలో కేరళ కోర్టు ఒక కేసును విచారించింది. వీధి కుక్కల కంటే మనిషి ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.


టీఎం ఇర్షాద్ వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసును విచారిస్తున్న హైకోర్టు జస్టిస్‌ పీవీ కున్హి కృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. వీధి కుక్కల భయం సామాన్యుల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తోందని అన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ కుక్కల బారిన పడుతున్నారని చెప్పారు.


వీధి కుక్కలు కాటు వేస్తాయని భయంతో పిల్లలు ఒంటరిగా బడికి వెళ్లేందుకు భయపడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కలపై చర్యలు తీసుకుంటే శునక ప్రేమికులు వారిపై పోరాటానికి దిగుతున్నారు. అయితే వీధి కుక్కల కంటే మనిషి ప్రాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు అభిప్రాయపడింది.

కేరళలో మానవులు, కుక్కల మధ్య పెరుగుతున్న ఘర్షణపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీని కారణంగా శాంతి భద్రతలు క్షీణించడం గురించి కోర్టు మాట్లాడింది. వార్తాపత్రికల్లో ఇలాంటి వార్తలు నిత్యం ప్రచురితమవుతున్నాయని, ఒక్కోసారి చిన్న పిల్లలపై, కొన్నిసార్లు యువత, వృద్ధులపైన వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని కోర్టు ప్రస్తావించింది.

అయితే వీధి కుక్కలను కూడా రక్షించాలని, వాటిని రక్షించేందుకు ముందుకు వచ్చే జంతు ప్రేమికులు జంతువుల జనన నియంత్రణ నిబంధనలు, 2023 పాటించక పోతే శిక్షిస్తామని కోర్టు స్పష్టం చేసింది. తదనుగుణంగా ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేయాలని వాదించింది. మీకు నిజంగా కుక్కలంటే ప్రేమ ఉంటే ప్రింట్, విజువల్ మీడియాలో వాటికి అనుకూలంగా మాట్లాడకుండా స్థానిక సంస్థలతో కలిసి పని చేయాలని కోర్టు పేర్కొంది.

Exit mobile version