Doctor Harshavardhan | చావు అంటేనే భయమేస్తోంది. పుట్టుక, చావు మధ్యలో ఉండే సమయాన్ని ఆనందంగా, సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎప్పుడో ఒక రోజు చనిపోతామని తెలిసీ కూడా ఆనందంతో కూడిన జీవితం కోసం నిత్యం కష్టపడుతుంటాం. తమకు చావు దగ్గర్లో ఉందని తెలిస్తే మనకు తెలియకుండానే శరీరంలోకి భయం ఆవహిస్తుంది. మృత్యువు భయం రూపంలో రోజురోజుకు కబళిస్తుంది. ప్రతి రోజు నైరాశ్యంతో, దుఃఖంతో బతుకుతుంటాం. కానీ చావును ముందే గ్రహించిన ఈ యువ డాక్టర్ మాత్రం కుంగిపోలేదు. తాను చనిపోతానని తెలిసీ.. ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా గడిపాడు. తాను చనిపోతున్నానని తెలిసి కట్టుకున్న భార్యకు విడాకులిచ్చి, ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. తల్లిదండ్రులు ధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందుకు ఓ లాయర్‌ను కూడా నియమించుకున్నాడు. మూడు పదుల వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయిన ఓ యువ డాక్టర్ జీవితగాధ ఇది. ఈ విషాదగాధ ఖమ్మం జిల్లాకు చెందిన యువ డాక్టర్ ఏపూరి హర్షవర్ధన్‌ది.
ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రామారావు స్థిరాస్తి వ్యాపారి కాగా, ప్రమీల ప్రభుత్వ హెడ్‌మాస్టర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్(33) ఇక్కడే బీ ఫార్మసీ పూర్తి చేసి, ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన హర్ష వర్ధన్.. క్వీన్‌లాండ్‌లోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేరాడు.
2020లో బంగారం లాంటి అమ్మాయితో వివాహం..
ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ హర్షవర్ధన్ 2020, ఫిబ్రవరి 20వ తేదీన ఖమ్మంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. బంగారం లాంటి అమ్మాయితో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అదే నెల 29న హర్షవర్ధన్ ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యాడు. వీసా వచ్చిన తర్వాత భార్యను తీసుకెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పాడు హర్షవర్ధన్.
అంతలోనే పిడుగులాంటి వార్త
2020, అక్టోబర్ నెలలో తను ఉంటున్న ఇంట్లోనే హర్షవర్ధన్ వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన దగ్గు, ఆయాసం వచ్చింది. దీంతో ఆ యువ డాక్టర్ వైద్య పరీక్షలు చేయించుకోగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఖమ్మం తిరిగి రావాలని కోరారు.
కానీ ఆస్ట్రేలియాలోనే అధునాతన వైద్యం ఉంటుంది. ఇక్కడే తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటానని పేరెంట్స్‌కు హర్షవర్ధన్ నచ్చజెప్పాడు. తనకు ఈ క్యాన్సర్ తగ్గిపోతోంది.. మీరు ధైర్యంగా ఉండండి అంటూ తల్లిదండ్రుల్లో ఆత్మస్థైరాన్ని నింపాడు.
చావు నుంచి తప్పించుకోలేనని గ్రహించి.. భార్యకు విడాకులు
శరీరాన్ని క్యాన్సర్ ఎలా కబళిస్తుందో ఒక డాక్టర్‌గా హర్షవర్ధన్ అంచనా వేసుకున్నాడు. చావు నుంచి తప్పించు కోలేనని నిర్ధారించుకున్నాడు. అయినప్పటికీ అతను కుమలిపోలేదు, కుంగిపోలేదు. భార్యతో సరిగ్గా పది రోజులు కూడా కాపురం చేయలేదు. తన వల్ల భార్య జీవితం నాశనం కావొద్దని ఆలోచించాడు. చిన్న వయసులోనే వితంతవుగా ఆమె మారొద్దని, ఆమె జీవితం ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో విడాకులు ఇచ్చాడు. భార్యకు తన జబ్బు గురించి వివరించి, ఆమెను ఇంకో పెళ్లి చేసుకోమని సూచించాడు.
2022, సెప్టెంబర్‌లో సొంతూరుకు వచ్చిన డాక్టర్
ఆరోగ్యం కుదుట పడుతుందని భావించిన హర్షవర్ధన్.. 2022, సెప్టెంబర్ నెలలో సొంతూరుకు వచ్చాడు. ఓ పదిహేను రోజుల పాటు తల్లిదండ్రులతో సంతోషంగా గడిపాడు. చిన్నప్పటి తన స్నేహితులను కలుసుకున్నాడు..తాను పుట్టి పెరిగిన ఊరు, తన బంధువులు, చదువుకున్న స్కూలు, తనకు పాఠాలు నేర్పిన టీచర్లు అందర్నీ కలుసుకున్నాడు. ఇక జీవితం ముగిసిపోతోందని తెలిసినా ఎక్కడా ఆ బాధని ముఖంలో తెలియనివ్వకుండా జాగ్రత్తలు పడ్డాడు. తర్వాత తాను గడిపిన ఆనందపు క్షణాల్ని గుండెల్లో దాచుకుని తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు.ఆ తర్వాత వ్యాధి మరింత ముదిరిపోయింది.
మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించి..
క్యాన్సర్ బాగా ముదరడంతో హర్షవర్ధన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈసారి చికిత్సకు వ్యాధి లొంగదని డిసైడ్ అయిపోయాడు. తనకు చావు దగ్గర్లోనే ఉందని గ్రహించాడు. మరణం తప్పదని డాక్టర్లు కూడా చెప్పారు. దీంతో చివరి రోజుల్లో తన తల్లిదండ్రులతో ప్రతి రోజు వీడియో కాల్ మాట్లాడేవాడు. వారిలో ధైర్యాన్ని నింపుతూ వచ్చాడు. హర్షవర్ధన్ ఏ మాత్రం భయపడకుండా మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాడు. బంగారం లాంటి భవిష్యత్‌ను క్యాన్సర్ కబళించడంతో.. మూడు పదుల వయసులోనే హర్షవర్దన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. మార్చి 24న యువ డాక్టర్ తుదిశ్వాస విడిచాడు.
డెడ్‌బాడీ తరలింపునకు హర్షవర్ధన్ ప్రత్యేక ఏర్పాట్లు..
తన మృతదేహాన్ని ఖమ్మంకు తరలించేందుకు చనిపోయే కంటే ముందే హర్షవర్ధన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో తన మరణానంతరం వ్యవహారాలు చూసుకోవడానికి, మృతదేహాన్ని కార్గోలో ఇండియాకు తరలించడానికి ఒక పెద్ద లాయర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. చివరకు హర్షవర్ధన్ మృతదేహం ఏప్రిల్ 5వ తేదీన ఖమ్మంలోని అతని ఇంటికి చేరింది. కుమారుడి అంత్యక్రియలను తల్లిదండ్రులు నిర్వహించారు. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
అందరి గుండెల్లో హర్షవర్ధన్
యువ డాక్టర్ హర్షవర్ధన్ జీవితం అలా ముగిసిపోయింది. చావును ముందే గ్రహించిన హర్షవర్ధన్ చివరి రోజుల్లో కూడా ధైర్యం కోల్పోలేదు. తన తల్లిదండ్రులకు ధైర్యం నూరిపోశాడు. కట్టుకున్న భార్యను వింతతువుగా చూడొద్దని ముందే ఆమెకు విడాకులిచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. తన బాధను గుండెల్లో దాచుకుని, అందరికీ సంతోషాన్ని పంచి, వారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుని ఈ లోకాన్ని విడిచివెళ్లాడు హర్షవర్ధన్.