Site icon vidhaatha

దొంగే దొంగ అన్నట్లుగా బీఆరెస్ వైఖరి

కాళేశ్వరం తప్పిదాలపై బహిరంగ చర్చకు సవాల్‌

కోదండరామ్ ఫైర్


విధాత : ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట సాగించిన దోపిడితో పాటు మేడిగడ్డ కుంగుబాటు నిర్వాకం బట్టబయలైనప్పటికి దొంగే దొంగ అన్నట్లు బీఆరెస్‌ వైఖరి ఉందని టీజేఎస్ చీఫ్ కోదండరాం విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మూడు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ పటిష్టంగా ఉందని చెప్పడం శుద్ద తప్పన్నారు. ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ, డిజైన్ లోపం వల్లే పిల్లర్లు కుంగిపోయాయన్నారు. మూడు పిల్లర్లే కదా కుంగిపోయిందని బీఆరెస్‌ వితండవాదం చేస్తోందని, కుంగినవి మూడు పిల్లర్లు కాదని తెలంగాణ ప్రజల భవిష్యత్తు అని కీలక వ్యాఖ్యలు చేశారు.


బీఆరెస్‌ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం అంటే తమ తప్పులను తామే అద్దంలో చూసుకోవడమే అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం తప్పిదాలపై బీఆరెస్‌ బహిరంగ చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10న చర్చకు రావాలన్నారు. దీనిపై బీఆరెస్‌ చర్చకు తెర లేపిందని ఆ చర్చకు టీజేఎస్ ముగింపు ఇస్తుందన్నారు. ఊరు ఊరు తిరిగి బీఆరెస్‌ బండారం బట్టబయలు చేస్తామన్నారు.


కాళేశ్వరం కామధేను ఎట్లా అవుతుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కామధేను కాదు తెలంగాణ పాలిట గుదిబండ అంటూ కోదండరాం విరుచుకుపడ్డారు. బీఆరెస్ పాలనలో ఇరిగేషన్‌, ఇంజనీరింగ్‌ వ్యవస్థ ఒత్తిళ్లతో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఫామ్ హౌస్ ప్రయోజనాల కోసం కేసీఆర్ సహా అధికారులంతా అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మార్చిన డిజైన్లకు సీడబ్ల్యుసీ అనుమతి తీసుకోలేదన్నారు. పంప్ హౌస్‌ల లోకేషన్ మార్చండని లేకపోతే మునిగిపోతాయని సీడబ్ల్యుసీ హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతీపై కాగ్ నివేదిక, ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్‌లు ఇప్పటికే బహిర్గతం చేశాయన్నారు.


డీపీఆర్ ఆమోదం లేకుండానే పనులు ప్రారంభించారని, జీయాలిజికల్ సర్వే చేయలేదని ఆరోపించారు. ఎన్నోసార్లు ప్రాజెక్టు అంచనాలు పెంచేశారన్నారు. పంప్ హౌస్‌లు, మోటర్లు మునిగిపోయాయన్నారు. ప్రతి ఏటా రూ 20 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రూపాయికి 50పైసలు తిరిగిరాని పెట్టుబడిగా మారిందన్నారు. మల్లన్న సాగర్ కట్టినా నీళ్లు నింపే పరిస్థితి లేదని తెలిపారు. భూకంపాలు వచ్చే నేలలో మల్లన్న సాగర్ కట్టారన్నారు. ఇప్పుడు తమ తప్పిదాలకు కుంగిన మేడిగడ్డకు ఏం చెప్పేందుకు బీఆరెస్‌ నేతలు వెళ్లారని నిలదీశారు. 

Exit mobile version