విధాత : ఆటో డ్రైవర్లపై కొందరికి కొత్త కొత్త ప్రేమలు పుట్టుకొస్తున్నాయని, మహిళలకు, ఆటో డ్రైవర్లకు ఏదో పంచాయితీ ఉన్నట్లుగా చెబుతున్నారని సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు పరోక్షంగా బీఆరెస్‌కు చురకలేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపై తీర్మానంపై ఆయన మాట్లాడారు. తాను ఏఐటీయూసీ తరుపున ఆటో డ్రైవర్ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని, వారి కోసం కేసుల పాలై, జైలుకెళ్లానన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణవసతితో వారి కుటుంబంలోని మహిళలు కూడా లబ్ధి పొందుతారన్నారు.
అయితే పట్టణ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. గత ప్రభుత్వ హాయంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు వేలకోట్లను కూడబెట్టుకున్నారని, వారంతా హైదరబాద్ భూములను స్వాహా చేసి సంపాదరించారని, ప్రభుత్వం ముందుగా నగర భూములను పరిరక్షించి ప్రజా అవసరాలకు ఉపయోగించి హామీల అమలుకు ఫ్రయత్నించాలన్నారు. అవినీతి అధికారులను, నాయకుల నుంచి అవినీతి సొమ్మును కక్కించి జైళ్లో వేస్త సీఎం రేవంత్‌రెడ్డి రియల్ హీరోగా నిలుస్తారన్నారు.
పేదలు గుడిసేలు వేసుకుంటే చట్టం వస్తుందని, బడా నాయకులు, అధికారులు తినే భూముల రక్షణకు మాత్రం ఏ చట్టం రావడం లేదన్నారు. ప్రసంగంలో అవినీతి అంశాలను విస్మరించారని, గత ప్రభుత్వ అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అవరసముందన్నారు. ప్రభుత్వం హామీల అమలు దిశగా భరోసా పెంచేలా గవర్నర్ ప్రసంగంలో చెబితే బాగుండేదన్నారు. హామీల అమలుకు అప్పుల రాష్ట్రంలో మరో 60వేల కోట్లు కావాల్సివుందని, దీనిపై కసరత్తు చేయాలన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చాల ఆశలతో ఉన్నారని, ఇండ్లు, ఉద్యోగాలు, సింగరేణి, జెన్ కో ఉద్యోగుల సమస్యలు తీర్చాల్సివుందన్నారు.
స్కాలర్ షిప్ లు, ఫీజు రీయంబర్స్‌మెంట్ల కోసం, సర్పంచ్‌ల బిల్లులు, కాంట్రాక్టుల బిల్లులు ఇవ్వాల్సివుందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, ఈపీఎఫ్, పోలీసు సంక్షేమ నిధి, రిటైర్డ్ ఎల్‌ఐసీ వారికి డబ్బులు చెల్లించాల్సివుందన్నారు. ఇవన్నింటికి ఉన్న అప్పులు..వడ్డీల సమస్యల మధ్య ఎలా నిధులు సమకూరుస్తారన్నది నాకు కూడా భయంగా ఉందన్నారు. పాఠశాలలు, హాస్టల్స్ సమస్యల కూపాలుగా ఉన్నాయన్నారు. గతంలో విద్యారంగానికి 14శాతం ఉన్న బడ్జెట్ 6శాతంకు పడిపోయిందన్నారు. పంటల బీమా పథకం అమలు చేయాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతులు, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చిన్న నీటి వనరుల విధ్వంసం చేశారని, వాటి పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మందు 14లక్షల బోర్లు కాస్తా 30లక్షలకు పెరిగాయని ఈ విషయమై ఆలోచన చేయాలన్నారు. పేదలకు రేషన్ కార్డులు, అందరికి హెల్త్‌కార్డులు ఇవ్వాలన్నారు. జబ్బులతో మనిషి చనిపోయాడన్న మాట లేకుండా ఆరోగ్య పథకాలు తేస్తే అంతకంటే మంచి ఇంకేమి ఉండదన్నారు. పారిశ్రామిక పెట్టుబడులను అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలన్నారు.