విధాత : తెలంగాణ బీజేపీ నేతలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన హక్కుల గురించి పోరాటం చేసే దమ్ము తెలంగాణ బీజేపీ నేతలకు లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
నాగేశ్వర్ చేసిన ట్వీట్ ఏంటంటే.. ఆస్కార్ రేసులో నిలవాల్సిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. గుజరాతీ సినిమా చేతిలో ఓడిపోయిందన్నారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. గుజరాత్‌కే లోకో మోటివ్ ఫ్యాక్టరీ వెళ్లింది. హైదరాబాద్‌కు రావాల్సిన డబ్ల్యూహెచ్‌వో సెంటర్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు పోటీగా గుజరాత్‌లో సెంటర్‌ను ఓపెన్ చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. ఆ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు గుజరాతీ బాస్‌ల చెప్పులను మోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు అందాల్సిన హక్కుల గురించి డిమాండ్ చేసే ధైర్యం తెలంగాణ బీజేపీ నేతలకు లేదని కేటీఆర్ అన్నారు. మోడీవర్స్‌కు గుజరాత్ కేంద్ర బిందువుగా మారిందని కేటీఆర్ తన ట్వీట్‌లో విమర్శించారు.