Site icon vidhaatha

దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ రచ్చ.. వెంట్రుక కూడా పీకలేవు: కేటీఆర్


విధాత : హామీల అమలు వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి నడిపిస్తున్నారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజవర్గం సమావేవంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడైందో..ఏమి కనుక్కున్నారో చెప్పమంటే మనకు చెప్పకుండా యూ ట్యూబ్‌లకు, మీడియాకు లీక్‌లిస్తున్నారని విమర్శించారు.


ప్రభుత్వం నీదే..అధికారం నీ చేతుల్లో ఉందిరా బై..ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చని మేం వద్దనడం లేదని, ఇక్కడ భయపడేటోడు లేనే లేడని, నీవు వెంట్రుక కూడా పీకలేరంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కొడుకుల్లారా పేగులు మెడలో వేసుకుంటా అని సీఎం రేవంత్‌రెడ్డి హవులా.. బేకార్ మాటలు మాట్లాడుతున్నాడని, జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెబుతున్నాడని, జేబుదొంగలే జేబులో కత్తెర పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి జేబులో కత్తెర అటు ఇటు అయితే చాల డేంజర్ అని, జాగ్రత్త సుమా నీకే నష్టమంటూ వ్యంగ్యాస్రాలు విసిరారు.


బెదిరింపులతో 2,500కోట్ల వసూళ్లు


ఢిల్లీకి కప్పం కట్టేందుకు..పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు బిల్డర్లను, రైస్‌మిల్లర్లను, క్రషర్ల వారిని, ఇసుక దందా చేసే వారిని బెదిరించి కోట్లాది రూపాయలు రేవంత్ ప్రభుత్వం వసూలు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖలో ఏం జరుగుతుందో గతంలో మంత్రిగా పనిచేసిన నాకు తెలుసని, మూడు నెలలుగా బిల్డర్లకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడ లేదని, బిల్డర్లు పైసల్ ఇస్తేనే పర్మిషన్ ఇస్తామని బెదరించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బిల్డర్లను బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి రూ. 2,500 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టాడని, ఇది దోపిడి సొమ్ము కాదా అని ప్రశ్నించారు. ఇవన్నిబయటకు రాకుండా ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం, బర్ల స్కామ్‌ అని టీవీలల్ల తిప్పుతూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.


కవిత అరెస్టు వెనుక మోదీ రాజకీయ కుట్ర


కవితను అరెస్టు చేయడం వెనుక ప్రధాని మోదీ రాజకీయ కుట్ర ఉందన్నారు. ఎన్నికల రేసులో తానొక్కడినే పరుగెత్తాలి..ఇంకెవరు పోటీకి ఉండొద్దన్నట్లుగా ప్రధాని మోదీ వ్యవహారిస్తు ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టు చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆరెస్‌, బీజేపీ ఒక్కటే అందుకే కవితమ్మని అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ నాయకులు బద్నాం చేసే ప్రయత్నం చేశారని కానీ ఇవాళ పగబట్టి అరెస్ట్ చేశారు కదా ఇప్పుడేమంటారని కేటీఆర్ ప్రశ్నించారు. నిరంకుశ బీజేపీ పార్టీని ఆపాలంటే కాంగ్రెస్ వల్ల కాదని, అది బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల వల్లనే అవుతుందన్నారు.


కోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే ఈడీ అధికారులు పగబట్టి ఇంటికొచ్చి కవితను అరెస్టు చేశారని, కవితను ఒక్కరినే కాదు..మరో ఇద్దరు ప్రతిపక్ష సీఎంలను కూడా అక్రమ అరెస్టులు చేసిన తీరు ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలపై చేస్తున్న దాడులకు నిదర్శనమని కేటీఆర్ పేర్కోన్నారు.


కాంగ్రెస్‌కు దేశంలో 40సీట్లు రావు


ప్రధాని మోదీని చౌకిదార్ చోర్ హై, అదానీ కామ్ కర్తే ప్రధాని అంటూ రాహుల్‌గాంధీ విమర్శించగా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని తమ బడాభాయ్ అనడం, అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకొనడాన్ని చూస్తే బీజేపీ పట్ల కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకత్వం వైఖరి భిన్నంగా కనిపిస్తున్నాయన్నారు. మోదీని రాహుల్ వ్యతిరేకిస్తుంటే.. రేవంత్ సమర్థిస్తున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే అని, అందుకే రాహుల్ గాందీకి భిన్నంగా బడే బాయ్ మోదీ అంటున్నాడని కేటీఆర్ ఆరోపించారు.


అందుకే జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటా అని రేవంత్ ఏనాడు అనడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40సీట్లు కూడా దేశంలో రావని, ఇదే అంశాన్ని మమతా బెనర్జీ కూడా చెబుతున్నారని, రానున్న రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, మమతా, కేజ్రీవాల్‌, కేసీఆర్‌లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆరెస్ ఎమ్మెల్యేలు గెలిచారని, ఈ లెక్కన మనం ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ అన్ని సీట్లు గెలువాలన్నారు.


దానం నాగరేందర్‌పై అనర్హత వేటు వేసేదాకా వదలం


ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ బీఆరెస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసి కోరామని కేటీఆర్ చెప్పారు. దానంను స్పీకర్ అనర్హుడిగా ప్రకటించేదాకా వదిలేది లేదని, సీఎం లేదా రాజకీయ ఒత్తిడికి లోనై స్పీకర్ చర్య తీసుకోకపోతే దీనిపై మేం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెలుతామన్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తున్నందునా మూడునాలుగు నెలల్లో వచ్చే ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు సిద్ధం కావాలన్నారు.


24 సంవ‌త్స‌రాల బీఆరెస్‌ చ‌రిత్ర‌లో ఈసారి త‌ప్ప‌కుండా సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నుంచి ప‌ద్మారావు గెల‌వ‌బోతున్నారని చెప్పారు. ఈ టెంపోను ప‌డిపోనివ్వ‌కుండా 53 రోజులు కాపాడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందని, చెర‌వు నిండిన త‌ర్వాత క‌ప్ప‌లు మ‌స్తు వ‌స్తాయని, కానీ క‌ష్ట‌కాలంలో నిల‌బ‌డ్డ వ్య‌క్తే నిజ‌మైన నాయ‌కుడు అని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.


దానం నాగేంద‌ర్‌వి అవ‌కాశ‌వాద రాజ‌కీయాలని, రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లు ఉంటాయన్నారు. త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే ఖ‌త‌మై పోతారని. అధికారం కోసం ఆశ‌ప‌డి, గెలిపించిన ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లోకి దాని వెళ్లారని తప్పుబట్టారు. ఆనాడు ఆసిఫ్‌న‌గ‌ర్‌లో దానం నాగేంద‌ర్ టీడీపీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లోకి రాగా, మ‌ళ్లీ ఉప ఎన్నిక‌లో ఓడిపోయారని, ఇప్పుడు కూడా అదే పున‌రావృతం కాబోతోందని చెప్పారు. పార్టీకి ద్రోహం చేసిన నాయ‌కుల‌కు బుద్ది చెప్పాల‌న్నారు.


సికింద్రాబాద్‌లో బీజేపీతోనే పోటీ


సికింద్రాబాద్‌లో పోటీ మ‌న‌కు కాంగ్రెస్‌తో లేదని, అది మూడో స్థానంలో ఉందని, దానంను ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదని, మ‌న‌కు పోటీ బీజేపీతోనే అని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎంపీ కిషన్‌రెడ్డి చేసిన గొప్ప మూడు పనులు ఏంటంటే కరోనా సమయంలో కేంద్ర మంత్రిగా కురుకురె ప్యాకెట్లు పంచాడని, కేసీఆర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తే, సీతాఫల్ మండిలో రెండు రైల్వే లిఫ్టులను ప్రారంభించడం, నాంపల్లి, గుడిమల్కాపూర్‌లలో సింటెక్ ట్యాంకులు ప్రారంభించడమేనని ఎద్దేవా చేశారు.


మారెడుపల్లి తహశీల్ధార్ కార్యాయంలో రేకుల షెడ్ వేయించాడమేనని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా హైదరాబాద్‌లో మూసీకి వరదలు వచ్చిన ఒక్క రూపాయి తేలేదని, కేంద్రం ఆధీనంలో ఉప్పల్, అంబర్ పేట్‌ రెండు ఫ్లై ఓవర్‌లను ఇంకా కిషన్‌రెడ్డి పూర్తి చేయించలేకపోయాడన్నారు. కేసీఆర్ హయాంలో 36ఫ్లై ఓవర్లు పూర్తి చేయించామని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన బైరామల్‌గూడ ఫ్లై ఓవర్ కూడా బీఆరెస్ కట్టించిందేనన్నారు. సికింద్రాబాద్‌లో పద్మారావుగౌడ్ గెలుపుకు పార్టీ కేడర్ అంతా సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

Exit mobile version