Site icon vidhaatha

KTR | నిరుద్యోగ మార్చ్‌పై నిప్పులు చెరిగిన KTR.. మోదీ ఇంటి ముందు చేయాల‌ని సూచ‌న‌

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేప‌ర్ లీకేజీ నేప‌థ్యంలో ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ మార్చ్ నిర్వ‌హిస్తామ‌న్న బీజేపీ(BJP) అధ్య‌క్షుడు బండి సంజ‌య్(Bandi Sanjay) ప్ర‌క‌ట‌న‌పై బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.

నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది ఇక్క‌డ కాదు.. ఢిల్లీలోని న‌రేంద్ర మోదీ ఇంటి ముందు చేయాల‌ని బీజేపీ నాయ‌కుల‌కు కేటీఆర్ సూచించారు. ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి కుమారుడు ప్ర‌శాంత్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా పెద్దఅంబ‌ర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ట్రంలో బీజేపీ నాయ‌కులు నిరుద్యోగుల కోసం ధ‌ర్నాలు చేస్తున్నారు. నాడు మోదీ సంవ‌త్స‌రానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. ఆ లెక్క‌న ఇప్ప‌టి వ‌ర‌కు 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. క‌నీసం 18 ల‌క్ష‌ల ఉద్యోగాలు కూడా ఇవ్వ‌లేదు. సిగ్గు లేకుండా ధ‌ర్నా చేస్తున్న బీజేపీ నాయ‌కులు.. ఉద్యోగాలు ఇవ్వ‌ని న‌రేంద్ర మోదీ ఇంటి ముందు నిరుద్యోగ మార్చ్ చేయాల‌ని సూచించారు.

కేంద్రంలో మీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంలోనే 16 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌మాట వాస్త‌వం కాదా? అని అడిగారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేస్తూ ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు పాత‌ర వేస్తున్నార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు గండి కొడుతూ.. మా త‌మ్ముళ్ల నోట్లో మ‌ట్టి కొడుతూ.. మీరు నిరుద్యోగ మార్చ్ చేస్తే న‌మ్మేందుకు తెలంగాణ ఎడ్డి తెలంగాణ‌, గుడ్డి తెలంగాణ అని అనుకుంటున్నారా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఇది హుషారైన తెలంగాణ‌.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో న‌డుస్తున్న తెలంగాణ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో పేప‌ర్ లీకేజీ అయింది నిజ‌మే అని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగుల‌కు న‌ష్టం జ‌ర‌గొద్ద‌నే ఉద్దేశంతో ఆయా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాం. జ‌రిగిన న‌ష్టానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉండే త‌మ్ముళ్ల‌కు, చెల్లెళ్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. త‌ప్పులు జ‌ర‌గొద్ద‌న్న ఉద్దేశంతో పేప‌ర్ లీక్‌ అయిన‌ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాం. కానీ మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. జ‌రిగిన న‌ష్టానికి అంద‌రం చింతిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. ద‌య‌చేసి ఈ చిల్ల‌ర‌గాళ్లు ప‌న్నిన ఉచ్చులో చిక్కుకోకండి అని కేటీఆర్ కోరారు.

Exit mobile version