విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుల గణన..ఇంటింటి సర్వే తీర్మానానికి చట్టబద్దత కల్పిస్తేనే ప్రయోజనముంటుందని మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టిన కులగణన తీర్మానం చర్చలో కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం హయాంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖపై రెండు సార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు.
అదేవిధంగా ప్రత్యేకంగా ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా విజ్ఞప్తి చేశామని తెలిపారు. అలా చేస్తే బీసీలకు రూ.2 లక్షల కోట్ల నిధులైనా వస్తాయని ఆశించమన్నారు. కుల గణన కోసం బిల్లును తీసుకొస్తే తమ పార్టీ తరఫున ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, రెండు రోజుల్లో బిల్లును ఆమోదించుకుంటామని, అవసరమైతే మరో రెండు రోజులు అసెంబ్లీ పొడగించడానికి మాకేమి అభ్యంతరం లేదన్నారు.
ప్రభుత్వం కులగణన బిల్లుకు స్ఫూర్తిగా చెబుతున్న యూపీఏ హయాంలోని సచార్ కమిటీ నియామకానికి ఆనాడు కేసీఆర్ చేసిన కృషి కూడా కారణమన్నారు. అయితే మంత్రి పొన్నం స్పందిస్తూ గతంలో కేంద్రం నిర్వహించిన సందర్భంలోనూ, బీహార్, ఏపీలలోనూ కులగణనకు చట్టబద్ధత కల్పించలేదని, బీఆరెస్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు కూడా చట్టబద్దత లేదని గుర్తు చేశారు.
బీసీల అభివృద్ధి కోసం జరుగుతున్న కులగణన ప్రయత్నానికి రాజకీయాలకు అతీతంగా ఆమోదం తెలుపాలని కోరారు. తీర్మానం చర్చలో సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్ధిన్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లు చర్చలో మాట్లాడారు. చర్చ అనంతరం కులగణన, ఇంటింటి సర్వే తీర్మానానికి బీఆరెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు మద్దతు తెలపగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్మానం ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు.