విధాత : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సరదాగా ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రోజూ భోజనం బాగుంటుందా..? ఇయ్యాల్నే మంచిగ పెట్టిండ్రా? అని విద్యార్థులను కేటీఆర్ అడగడంతో .. ఈ రోజే అని వారి నుంచి సమాధానం వచ్చింది. దీంతో నవంబర్‌లో మళ్లీ వచ్చే సరికి అన్నీ బాగుండాలని, ప్రతిరోజూ ఇలాగే ఉండాలని వీసీని ఆదేశించారు. అయితే తాను కూడా హాస్టల్‌లో ఉండి చదువుకున్నానని, ఆ కష్టాలు తనకు తెలుసని కేటీఆర్ విద్యార్థులతో అన్నారు. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుందామని విద్యార్థులకు నచ్చజెప్పారు కేటీఆర్.
‘విద్యార్థులు కింద కూర్చోవడం నాకు నచ్చలేదు. అయితే అందరం కిందనైనా కూర్చోవాలి. లేదా పైన కూర్చోవాలి. ఇలా సగం సగం కూర్చోవడం బాగోలేదు. విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు మళ్లీ నవంబర్‌లో క్యాంపస్‌కు వస్తాను. నవంబర్‌లో మళ్లీ వచ్చే సరికి ఆడిటోరియంలో కుర్చీలు ఏర్పాటు చేస్తాం. దానికయ్యే డబ్బును వెంటనే మంజూరు చేస్తాం. ఆడిటోరియంలో మార్పులు చేయాలని ఆదేశిస్తాం. నా జీవితం 70 శాతం హాస్టల్‌లోనే గడిచింది. హాస్టల్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించేందుకు సమయం పడుతుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పిల్లలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము. క్యాంపస్‌లో మినీ టీ హబ్ ఏర్పాటు చేస్తాము. విద్యార్థులు తయారుచేసిన ఉత్పత్తులతో ప్రతీ సంవత్సరం వారం రోజులు ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలి. అమెరికాలోని MIT లాగా బాసర ట్రిపుల్ ఐటీ మారాలి. MIT ల్యాబ్ నుంచి వచ్చిన కంపెనీలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి. పరిశోధనలే నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తాయి. ఆవిష్కరణల నుంచి కంపెనీలు పుడతాయి. ఆ కంపెనీల నుంచి ఉద్యోగాలు, సంపద పుడతాయి. బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్ ల్యాబ్ -మిని టీ హబ్ ఐటీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేస్తాము. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అడిగిన ప్రతీ విజ్ఞప్తిని అంగీకరించడని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. మీరందరూ వెళ్లి భరోసా ఇచ్చిరండని కేసీఆర్ చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 3 కోట్లతో మిని స్టేడియం ఏర్పాటు చేస్తాము. ఆరు నుంచి ఎనిమిది నెలల లోపు అది పూర్తవుతుంది. 1000 కంప్యూటర్‌లతో ఆధునిక డిజిటల్ ల్యాబ్ ఏర్పాటుచేస్తాము. 50 అదనపు మోడర్న్ క్లాస్ రూంలు, మోడ్రన్ ఫర్నీచర్‌తో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మీ యూనివర్సిటీని మీరే బాగా చూసుకోవాలని చెప్పి తన జపాన్ అనుభవాన్ని కేటీఆర్ విద్యార్థులతో పంచుకున్నారు. అక్కడ శుభ్రతకు ఇచ్చే ప్రాముఖ్యతను వివరించారు. క్యాంపస్ మేయింటనెన్స్ అనేది సమష్టి బాధ్యత. బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. నెలకొక్కసారైనా శ్రమదానం చేపట్టండని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కొవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. విద్యావ్యవస్థ అతలాకుతలమైంది. మళ్లీ గాడిలో పడాలంటే కొంత సమయం పట్టింది, ఈ క్రమంలోనే ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న వసతులను మరింత మెరుగుపరిచే బాధ్యతను తీసుకుంటా’ అని కేటీఆర్ చెప్పారు.