- ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఆటో కార్మికుల పొట్ట కొటారని ఆగ్రహం
- తెలంగాణ హక్కుల సాధన బీఆరెస్‌తోనే సాధ్యం
KTR | విధాత : ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఘట్‌కేసర్‌లో మేడ్చల్ నియోజకవర్గం బీఆరెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నామని కాంగ్రెస్ చెబుతుందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి రాకపోతే రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు.
కృష్ణా, గోదావరి తెలంగాణ జీవ నదులని, కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శించారు. అందుకే బీఆరెస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆరెస్ ఎంపీలు మాత్రమేనన్నారు. మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, 420 హామిలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి లోక్‌సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 9న రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని.. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఆ ప్రస్తావనే లేదని అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1న ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి చేయడం లేదన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని, ఉచిత బస్సుల వల్ల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలుసని, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు. ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతీశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను ఎంతో మందిని చూశామని మూడు ఫీట్లు లేని రేవంత్ రెడ్డి బీఆరెస్‌ను వంద మీటర్ల లోతున బొందపెడుతామని బుడ్డర్‌ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడన్నారు. గులాబీ జెండా బాస్ ఢిల్లీ, గుజరాత్‌లలో లేరని, ఢిల్లీలో మన మాట వినపడాలంటే బీఆరెస్‌కు ఓటు వేయాలని, గులాబీ జెండాకు ఓటు వేస్తేనే మన గొంతుక ఉంటుందని కేటీఆర్ అన్నారు.