మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసే దమ్ముందా?

సీఎం రేవంత్‌రెడ్డికి బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు మధ్య సవాళ్లు..ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతుంది

  • Publish Date - February 29, 2024 / 10:46 AM IST

  • సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌
  • కొడంగల్‌కు రాజీనామా చేసి రావాలి
  • నేను సిరిసిల్లకు రాజీనామా చేసి వస్తా
  • ఇద్దరం మల్కాజిగిరిలో పోటీ చేద్దాం
  • మగాడివైతే హామీలు అమలు చేయాలి
  • పేమెంట్‌ కోటా సీఎం.. ఢిల్లీకి చెల్లింపులు
  • బిల్డర్లు, వ్యాపారులపై ‘రేవంత్ సెస్‌’
  • మేడిగడ్డ మాటున సిల్లీ రాజకీయాలు
  • బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌



విధాత, హైదారాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతున్నది. మగాడివైతే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటునైనా గెలిపించుకోవాలని ఇటీవల చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దానిపై కేటీఆర్‌ గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తనతో మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పోటీ పడాలని సవాల్‌ విసిరారు.


రేవంత్‌రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, తాను కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇద్దరం కలిసి మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామన్నారు. గెలిచిన ప్రతిసారీ మగవాడిని.. ఒడితే కాదు అంటావా.. అయితే కొడంగల్‌లో నీవు ఒడిపోయినప్పుడు మగడివికాదా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయాలని, అడబిడ్డలకు 2500 ఇవ్వాలని, ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు.


పదే పదే మగాడివా అంటూ రేవంత్‌ వ్యాఖ్యలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. అడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా? పదేపదే మగాడివా అంటూ ఆ మాటాలు ఎందుకు? అని తప్పుబట్టారు. రేవంత్‌కు ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్‌ ఉన్నదని అన్నారు. అందుకే అయన తానే సీఎం అని అన్నిసార్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయనకు అయననే సీఎం అన్న నమ్మకం లేనట్లుందని చురకలేశారు. గతంలో కొండగల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో కూడా రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తెలంగాణ విడిచి వెళతానని సవాల్ విసరి, ఓటమితో పారిపోయాడని గుర్తు చేశారు. అలాంటి అయన మాటకు విలువ ఏం ఉందంటుందని ప్రశ్నించారు.


రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కేటీఆర్‌ అన్నారు. తనది మేనేజ్‌మెంట్‌ కోటా అయితే రాహుల్, ప్రియంకలది ఏం కోటా అని ప్రశ్నించారు. మాణిక్కం ఠాకూర్‌కు డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి పేమెంట్‌ కోటా అని ఆరోపించారు. పేమెంట్‌ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పేమెంట్‌ చేయాలని.. అందుకే రాష్ట్రంలో బిల్డర్లను, వ్యాపారులను బెదిరిస్తూ, ఢిల్లీకి కప్పం కట్టడం, బ్యాగులు మోయడం చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం భవన నిర్మాణ అనుమతులను ఆపారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు ‘రేవంత్ సెస్‌’పై రోడ్డు ఎక్కుతారని కీలక వ్యాఖ్యలు చేశారు.


మేడిగడ్డ మాటున కాంగ్రెస్ సిల్లీ రాజకీయాలు


తాము మేడిగడ్డ బరాజ్‌ సందర్శనకు వెళుతుంటే కాంగ్రెసోళ్లు పాలమూరు-రంగారెడ్డికి వెళుతామంటూ చిల్లర (సిల్లీ) రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి, రైతులకు నీళ్లందించాలని, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. ఇప్పటికే రోజుకు 5వేల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వద్ద వృథాగా పోతున్నదని తెలిపారు. శుక్రవారం తాము మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను పరిశీలించి తీరుతామని స్పష్టం చేశారు. బరాజ్‌లను పరిశీలించాక అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డలో పగుళ్లను తాము కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని సరిచేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి కానీ ఇలా రాజకీయంగా వాడుకోవాలని చూడకూడదని హితవు పలికారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులు గడిచిందని, ఈ 80 రోజుల్లో గత బీఆరెస్‌ పాలనపై ఆరోపణలు, శ్వేత పత్రాలు అంటూ కాలయాపన చేశారని, ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం ఎక్కడైనా మేడిగడ్డ బరాజ్‌లో శాంపిల్స్ సేకరించిందా? అని ప్రశ్నించారు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. దమ్ముంటే.. తప్పు జరిగితే నిరూపించాలని, తప్పని తేలితే చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. అవన్నీ పక్కనపెట్టి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా.. ఇవ్వకుండా బీఆరెస్‌ను బద్నాం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News