lakes |
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సరస్సుల్లో సగానికి పైగా సరస్సులు కుచించుకుపోతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. దీని వల్ల వాటిపై తాగు, సాగు అవసరాలకు ఆధారపడిన ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని తెలిపారు.
వలస పక్షులకు ఆశ్రయం దొరకకపోవడమే కాకుండా.. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ధూళి తుపానులు చెలరేగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాగా ప్రపంచజనాభాలో 25 శాతం మంది నేరుగా సరస్సులు, రిజర్వాయర్లు, చెరువులపై జీవిస్తున్నారు.
1992 నుంచి 2020 వరకు సుమారు 2000 సరస్సులు, చెరువులను యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు గమనించారు. శాటిలైట్ చిత్రాల ద్వారా వాటి నీటి పరిమాణంలో హెచ్చుతగ్గుల్ని లెక్కగట్టారు. అంతేకాకుండా వాటిపై ఆధారపడి జీవిస్తున్న జనాభా లెక్కలనూ పరిగణనలోకి తీసుకున్నారు.
2000 సరస్సుల్లో 53 శాతం జల వనరులు కుచించుకుపోతుండగా.. 22 శాతం మాత్రమే పరిమాణాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి. 28 ఏళ్లుగా వీటి నుంచి 600 క్యూబిక్ కి.మీ. నీటిని మనం కోల్పోయామని పరిశోధకులు పేర్కొన్నారు.
పర్యావరణ మార్పులు, మితిమీరిన ప్రజా వినియోగం తదితర కారణాల వల్ల సహజ సరస్సులు ఎండిపోతున్నాయని, మానవ నిర్మిత రిజర్వాయర్లలో పూడిక అతిపెద్ద సమస్యగా మారిందని తెలిపారు.