Lakshmi Parvati | సూర్యాపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ ఎన్ లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని ఆమె అన్నారు. రాజకీయంగా రేవంత్ పరిణితి చెందలేదని, పాలనలో అనుభవం కూడా లేదన్నారు.
సూర్యాపేట జిల్లాలోని నందిగూడెం ఫోర్ట్‌ను లక్ష్మీపార్వతి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ ఢిల్లీలోని ఆ పార్టీ హైకమాండ్ మీద ఆధారపడుతారని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరించారని, నీళ్లతో కళకళలాడయని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. రైతులు సమృద్ధిగా పంటలు పండించుకున్నారని తెలిపారు. ఇక ఏపీలో మళ్లీ వైఎస్సార్‌సీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.