Site icon vidhaatha

YADADRI: రామావతారంలో హనుమంత వాహనంపై విహరించిన లక్ష్మీనరసింహుడు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారు రామావతార అలంకార సేవలో హనుమంత వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయం గర్భాలయంలో స్వామివారికి నిత్యాభిషేకాలు, ఆరాధనలు నిర్వహించిన పిదప బ్రహ్మోత్సవాల పర్వంలో భాగంగా లక్ష్మీనరసింహుడిని కోదండరామావతార అలంకార సేవ లో హనుమంత వాహనంపై విహరింప చేశారు.

భక్తుడికి భగవంతుడికి మధ్య ఆభేద్యమైన బంధానికి రామ, హనుమంతులు ప్రతీక. ఆదర్శ పురుషుడైన రాముడు.. అద్వితీయమైన భక్తితో జ్ఞాన స్వరూపుడైన హనుమంతుడు భక్తులకు అనుసరణీయ సన్మార్గాన్ని చూపడమే రామావతార హనుమంత్ వాహన సేవల విశిష్టత.

తిరువీధుల్లో లక్ష్మీ నరసింహుడు కోదండరామావతారంలో హనుమంత్ వాహనంపై ఆసీనులై అర్చక పండిత బృందం, పారాయణికులు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య, జయ జయ ద్వానాల మధ్య మంగళ వాయిద్యాలు మేళతాళాలతో విహరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ గీత. ఆలయ అధికారులు, సిబ్బందిజ్ భక్తులు పాల్గొన్నారు.

సాయంత్రం బ్రహ్మోత్సవాల పర్వంలో లక్ష్మీనరసింహుడు పెళ్లి కొడుకుగా ముస్తాబై గజవాహనరూఢుడై అమ్మవారైన లక్ష్మీదేవిని పరిణయం ఆడేందుకు పెళ్లి మంటపానికి వేంచేయనున్నారు.

రాత్రి 8 గంటలకు పాంచరాత్రాగమ శాస్త్రానుసారం లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

Exit mobile version