విధాత: హర్యానా సరిహద్దులోని ఖానౌరీ వద్ద పోలీసుల కాల్పుల్లో శుభ్‌కరణ్‌సింగ్ అనే 22 ఏళ్ల యువరైతు చనిపోయిన విషయం తెలిసిందే. ఆయనది పంజాబ్‌లోని భటిండా జిల్లా బలోక్ గ్రామం. ఫిబ్రవరి 13న ప్రారంభమైన చలో ఢిల్లీ మార్చ్‌లో ఆయన తొలి రోజు నుంచీ పాల్గొంటున్నాడు బుధవారం హర్యానా పోలీసులు జరిపిన కాల్పల్లో చనిపోయాడు. బుధవారం ఉదయం తానే అల్పాహారాన్ని తయారు చేసిన శుభ్‌కరణ్‌సింగ్.. తన సహచర రైతులను పిలిచి కలిసి తిందామని చెప్పారు.
‘మరోసారి అందరం కలిసి కూర్చొని తినే అవకాశం వస్తుందో రాదో.. రండి. అందరం కలిసి తిందాం’ అని చెప్పాడని ఆయన సహచర రైతులు గుర్తు చేసుకున్నారు. శుభ్‌కరణ్‌కు ఇద్దరు చెల్లెళ్లు, నానమ్మ, తండ్రి ఉన్నారు. తండ్రి ఒక స్కూలు వ్యాన్ డ్రైవర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడెకరాల రైతు అయిన శుభ్‌కరణ్.. పాడి పశువులను కూడా పెంచుతున్నాడు. ఒక చెల్లెలికి వివాహమైంది. మరో చెల్లెలు చదువుకుంటున్నది. పెద్ద చెల్లెలు వివాహానికి అప్పు చేశాడని వారి ఇరుగుపొరుగు చెబుతున్నారు. అతనిది చాలా పేద కుటుంబమని వారు తెలిపారు.
శుభ్‌కరణ్‌సింగ్ మరణానికి కచ్చితమైన కారణం ఇంకా వెల్లడికాలేదు. అతడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాకే మృతదేహానికి పోస్టు మార్టం చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. శుభ్‌కరణ్‌ను అమరవీరుడిగా పంజాబ్ ప్రభుత్వం ప్రకటించాలని, దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి లభించేవి అందించాలని రైతు నాయకుడు జగ్జీత్‌సింగ్ దల్లేవాల్ మంగళవారం డిమాండ్ చేశారు.
దానితోపాటు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఐదుగురు సభ్యుల బోర్డును నియమించాలని కోరారు. మరోవైపు రైతు మరణం రాజకీయంగా చిచ్చు రేపుతున్నది. రైతు మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించడంతో ఇది హర్యానా, పంజాబ్ ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసింది.