- చర్చనీయాంశంగా ప్రధాన పార్టీల తీరు
- పదవులకే పరిమితమైన ముఖ్యనేతలు
- ఉక్కు ఫ్యాక్టరీ సాధించడంపై దృష్టి పెట్టాలి
- అభివృద్ధి అంశంలో ‘ఐక్యత’ అవసరం
విధాత ప్రత్యేక ప్రతినిధి: రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రధాన పార్టీలు, నాయకులు పడుతున్న పోటీ.. కనబరుస్తున్న శ్రద్ధ వరంగల్ జిల్లా అభివృద్ధి పై చూపెట్టడంలేదు. తమకు లభించే పదవులు, ప్రభుత్వంలో, పార్టీలో తమకు ప్రాధాన్యత ఉందా ? లేదా? అనే వాటికి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లాలో తమ పార్టీ పట్టు సాధించడం పైన్నే ప్రధాన నాయకులు దృష్టిపెడుతున్నారు. ఇదే బాటలో ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచరుల తీరు కూడా ఉంది. గత కొన్నేళ్ళుగా జిల్లా అభివృద్ధి, పురోగతికి సంబంధించి ప్రధాన పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై అన్ని వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా జిల్లా ఆశించిన అభివృద్ధి సాధించడంలేదు. ముందుకు సాగాల్సిన పురోగతి కుంటుపడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ఆరు జిల్లాలుగా కొనసాగుతోంది. అన్ని రకాల వనరులున్నప్పటికీ ఆశించిన ప్రగతి, అవసరమైన ప్రాజెక్టులు, పరిశ్రమలకు నోచుకోవడంలేదు. దీనికి భిన్నంగా ‘రాజకీయ ఆధిపత్యానికి’ పోటీలు పడేందుకు, అధినాయకత్వానికి తాబేదార్లుగా పనిచేయడానికి పరిమితమవుతున్నారు.
అభివృద్ధికన్నా.. పొలిటికల్ మైలేజీకి ప్రాధాన్యత
రాకరాక, దశాబ్దాల తర్వాత వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. పార్టీలు ఏవైనా, నాయకులు, ప్రజా ప్రతినిధులెవరైనా ఈ ఎయిర్ పోర్టుతో పాటు ఇతర అభివృద్ధి అంశాలను చర్చకు తీసుకరావాల్సిన పార్టీలు, నాయకులు దీనికి భిన్నంగా వ్యవహరించారు. అధికారంలో ఉన్న రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా వ్యవహరించాయి. తమ పార్టీలు, తమ ప్రభుత్వం వల్లే ఎయిర్ పోర్టు పునరుద్ధరణ జరిగిందని చెప్పుకుంటూ క్రెడిల్ వార్ కు యత్నించారు. ఏ పార్టీకిఆ పార్టీ వేర్వేరుగా ప్రయత్నిస్తే తప్పేమీలేదుగానీ పొలిటికల్ మైలేజ్ కోసం ఇరుపార్టీలు పోటీపడ్డారు. పరస్పరం ఘర్షణ పడుతూ లీడర్ల మెప్పు పొందేందుకు ప్రాధాన్యతనివ్వడం జుగుప్సాకరంగా మారింది. ఇరువర్గాల ఘర్షణ వాతావరణంతో మామునూరు ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తతత ఏర్పడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
దశాబ్దాలుగా నిర్లక్షానికి గురైన వరంగల్
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం, వెనుకబాటు తనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ సెంటిమెంటును పదేపదే వల్లించిన బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదనే అభిప్రాయాలున్నాయి. అధికార మార్పిడి జరిగి ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాసింత మార్పు కనిపిస్తున్నప్పటికీ మరింత వేగం పుంజుకోవాల్సి ఉంది. బీఆర్ఎస్ కు తొలి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమపరంగా అండగా నిలిచింది. ప్రతీ ఎన్నికలో ఆ పార్టీకి ఆదరణ లభించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎంపీలు, 12 ఎమ్మెల్యే స్థానాల్లో మెజార్టీ కట్టబెట్టారు. ప్రతీ కష్టకాలంలో అండగా నిలిచారు. అయినప్పటికీ దశాబ్దకాలం పాటు వరంగల్ నగరంతో పాటు, మిగిలిన ప్రాంతాలు ఆశించిన పురోగతి సాధించలేదు. ఈ కారణంగానే ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలను ఈ సారి కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ నగరాభివృద్ధికి కొంత నిధులు, ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఈ ప్రగతి మరింత కొనసాగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత వరంగల్ ప్రధాన నగరంగా ఉన్నప్పటికీ ఇటీవల వెనుకంజలో ఉంది.
కేంద్రం పై రాజకీయ ఒత్తిడి అవసరం
కేంద్రంలో దశాబ్దకాలానికి పైగా బీజేపి అధికారాన్ని కొనసాగిస్తున్నది. రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు దశాబ్దకాలం దాటిని పూర్తికాలేదు. వీటిపై పార్టీలకు అతీతంగా ఒత్తిడి తీసుకరావాల్సి ఉంది. ముఖ్యంగా నగరాభివృద్ధికి ప్రత్యేక నిధులతో పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సాధించాల్సి ఉంది. ఎయిర్ పోర్టు పునరుద్ధరణ సందర్భంగా పాలాభిషేకం, పుష్పాభిషేకాలలో పోటీపడేకంటే ప్రభుత్వాల పై ఒత్తిడి తెచ్చి నిధులు తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు, నేతలు కృషి చేయాలని కోరుతున్నారు. పొలిటికల్ విల్ పవర్ ప్రదర్శించి అభివృద్ధి అంశంలో నాయకులు, పార్టీలు ఐక్యతను ప్రదర్శించాలని కోరుతున్నారు.