మనువాదం అశాస్త్రీయం.. అసమానతలకూ కారణం

అశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని సామాజిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు

  • Publish Date - December 25, 2023 / 10:28 AM IST
  • ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్‌తో దేశానికి ప్రమాదం
  • సామాజిక ప్రజా సంఘాల నేతలు ధ్వజం
  • నల్గొండ అంబేద్కర్ సర్కిల్ లో ప్రతులు దహనం


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: అశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని సామాజిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సామాజిక ప్రజా సంఘాల (కేవీపీఎస్, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఎంఎస్పీ, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, మాల మహనాడు) ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేశారు.


ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత దేశంలో సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షతలకు కారణమైనది మనుధర్మ శాస్త్రమేనని మండిపడ్డారు. ఈ దేశ బహజన సామాజిక వాదులంతా మనువాదాన్ని ఈ దేశ మట్టిలోనే పాతరేయాలని అంబేద్కర్ పిలుపునిచ్చాడన్నారు.


అందులోభాగంగానే 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ మను ధర్మ శాస్త్రాన్ని మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో వేలాది మంది దళిత, బహుజనలతో కలిసి దహనం చేసినట్లు చెప్పారు. అసంబద్ధమైన, అనాగరికమైన ఆలోచనల ద్వారా వేయిల సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించింది మనుస్మృతేనని వారన్నారు. భారతదేశంలో మెజార్టీ ప్రజలకు సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను దూరం చేయడానికి దుర్మార్గమైన కర్మ సిద్ధాంతాన్ని నమ్మించడానికి ప్రపంచంలో మరెక్కడలేని విధంగా ఈ దుర్మార్గపు సిద్ధాంతం మన దేశంలో బ్రాహ్మణీయ మనువాద శక్తులు అమలు చేస్తున్నాయన్నారు.


దాని దుష్ఫలితాలు నేటికి అనేక అసమానతలకు మూలాలుగా కొనసాగుతున్నాయిన్నారు. చదువు, భూమి, ఆభరణాలు, ఆయుధాలు, అధికారాలు అన్ని కొద్దిమంది చేతుల్లో ఉంచుతుంది మనుస్మృతే అన్నారు. మెజార్టీ ప్రజలు నిషేధించిన మనుస్మృతి భావాలను తుదముట్టించకపోతే ఈ దేశ ప్రజలు వేల ఏండ్లుగా అనుభవిస్తున్న అన్ని రకాల వివక్షతలు, అసమానతలు, దోపిడీ వంశపారంపర్యంగా కొనసాగి కొందరు కోటీశ్వర్లుగా, కోట్లాది మంది బికార్లుగా శాశ్వతంగా నిలబెడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.


అంతిమంగా దోపిడీ వర్గాలకు సైద్ధాంతిక పునాదిగా నిలిసిందన్నారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడటానికి, దోపిడీ వ్యవస్థ రక్షణకై పుట్టిందే మనువాదం అన్నారు. రాజ్యాంగ రక్షణ ద్వారా దేశాన్ని కుల, మత, ప్రాంతం, భాష, లింగ భేదం లేకుండా ఐక్యంగా ఉంచగలమన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ వదలబోయే మనుస్మృతి రాజ్యాంగం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంధన్నారు. బహుజన లోకమంతా జాగ్రత్త గా నిలబడి, మనుస్మృతిని మట్టిలో పాతరేయాలన్నారు.


ఈ కార్యక్రమంలో నాయకులు పుచ్చకాయల నర్సిరెడ్డి (సీపీఐ(ఎం)), ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, కోట్ల ఆశోక్ రెడ్డి(డీవైఎఫ్ఐ), తెలంగాణ మాల మహనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి సైదులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు గాదె నరసింహ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.