Mahabubnagar
- ఎన్నికల అఫిడవిట్లో టాంపరింగ్ ఆరోపణ
- కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు
- మంత్రిని భర్తరఫ్ చేయాలని విపక్షాల డిమాండ్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ టాంపరింగ్ కు పాల్పడినట్లు పాలమూరు కు చెందిన ఓటరు రాఘవేంద్రరాజు కోర్టు లో కేసు వేశారు. శ్రీనివాస్ గౌడ్ తో పాటు అతనికి సహకరించిన ఎన్నికల అధికారులపై కేసు వేశారు. నాలుగు ఏళ్ల నుంచి ఈ కేసు హై కోర్టు లో నడుస్తూనే ఉంది. కేసును మంత్రి శ్రీనివాస్ గౌడ్ జీర్ణించు కోలేదు.
కేసు వేసిన రాఘవేంద్ర రాజు పై మండిపడుతూ ఆయనను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు మంత్రి ఎదుర్కొన్నారు. మంత్రి పై హత్యాయత్నం కేసులో రాఘవేంద్ర రాజు మరికొందరు జైలు కు కూడా వెళ్లొచ్చారు. అయినా మంత్రి పై వారి పోరాటం ఆగలేదు. కోర్టు కేసు ద్వారానే శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి నుంచి దించాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. తనపై పెట్టిన కేసు నిరాధారమైందని, ఈ కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మంత్రి అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం హై కోర్టుకు వెళ్లాలని సూచించింది. మళ్ళీ హై కోర్టును ఆశ్రయించిన మంత్రికి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. మంత్రి వేసిన పిటీషన్ ను హై కోర్టు తిరస్కరించింది. వెంటనే ఈ కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు శ్రీనివాస్ గౌడ్ పై, అతనికి సహకరించిన ఎన్నికల అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇక్కడే ప్రతి పక్షాలు బీఆరెస్ పార్టీని ఇరుకన పెట్టేoదుకు సిద్ధమయ్యారు.
పాలమూరు లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. తప్పు చేసిన మంత్రిని వెనుకేసుకు రావడం సిగ్గు చేటని బీఆర్ఎస్ ను దుయ్య బడుతున్నారు. బీజేపీ నాయకులు ప్లకార్డ్ లతో నిరసన ర్యాలీ చేపడుతున్నారు.
నిత్యం కాంగ్రెస్ ను విమర్శించే శ్రీనివాస్ గౌడ్ తాను చేసిన తప్పు ఒప్పుకుని తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని పాలమూరు డీసీసీ అధ్యక్షులు జి.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పదవి నుంచి శ్రీనివాస్ గౌడ్ ను భర్తరఫ్ చేసేవరకు పోరాటం ఆగదని బీజేపీ నాయకులు పి. చంద్ర శేఖర్,పాండురంగారెడ్డి, జయశ్రీ,వెంకటేష్ తదితరులు స్పష్టం చేశారు.