మ‌హారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కోవిడ్

దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా పంజా విసురుతున్న‌ది. తాజాగా మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

  • Publish Date - December 25, 2023 / 06:41 AM IST
  • కరోనా పాజిటివ్ అని వెల్ల‌డించిన డిప్యూటీ సీఎం


విధాత‌: దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా పంజా విసురుతున్న‌ది. తాజాగా మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని పవార్ మీడియాకు వెల్ల‌డించారు.

“నా క్యాబినెట్ స‌హ‌చ‌రుల్లో ఒకరైన ధనంజయ్ ముండేకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగం ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకుంటున్న‌ది. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు అవసరమైన సూచనలు అధికారులకు అందిస్తున్నాం” అని ఆయన చెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు (డిసెంబర్ 20) ఆయ‌న పాజిటివ్ వచ్చినట్టు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.

“మంత్రి డిసెంబర్ 21 న ఇంటికి వెళ్లి, ఐసోలేషన్‌లో ఉండి, వైద్యులు సూచించిన మందులు తీసుకున్నారు. ఇప్పుడు ఎటువంటి లక్షణాలు లేవు. ఆయ‌న ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం, అనేక పనులపై ఫాలో-అప్‌లు తీసుకోవడం ప్రారంభించారు” అని సిబ్బంది పేర్కొన్నారు. మంత్రి కార్యాలయ సిబ్బందిలో కొందరు కూడా అస్వస్థతకు గురయ్యార‌ని, కానీ అంద‌రూ ప్రోటోకాల్‌ను పాటించి ప్రజలతో క‌ల‌వ‌డం లేద‌ని వెల్ల‌డించారు.