విధాత, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.
వివిధ ప్రాంతాలకు చెందిన 24 కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు కటాక్షించనున్నారు.
మోహినీ అవతారం నృత్యరూపకం
పశ్చిమగోదావరి జిల్లా పురుషోత్తమపట్నంకు చెందిన గరుడాద్రి శేషాద్రి కళాబృందం మోహినీ అవతార నృత్య రూపకాన్ని చక్కగా ప్రదర్శించారు.
క్షీరసాగర మథనంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం పోటీ పడడం, మోహినిగా స్వామివారు రంగప్రవేశం, అమృతాన్ని దేవతలకు పంచడం వంటి ఘట్టాలను ప్రత్యేక వేషధారణలతో ఆవిష్కరించారు.
తప్పెట గుళ్ల జానపద నృత్యం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన కళాకారులు ప్రదర్శించిన తప్పెట గుళ్లు జానపద నృత్యం భక్తులను ఆకట్టుకుంది. పాదానికి సిరిమువ్వలు, తొడకు పెద్ద మువ్వలు, రంగురంగుల కాశికోట, ఛాతిపై తప్పెటను అమర్చుకుని కళాకారులు ప్రదర్శించారు.
వీరు శ్రీవేంకటేశ్వరుడు, శ్రీరాముడు, శ్రీకష్ణునికి సంబంధించిన కీర్తనలను జానపద బాణీలో పాడుతూ నృత్యం చేశారు. వీరు గుండ్రంగా తిరుగుతూ పైకి ఎగురుతూ నృత్యం చేయడం ఆకట్టుకుంది.
పలమనేరు కీలుగుర్రాలు
పలమనేరుకు చెందిన కళాకారుల కీలుగుర్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో పొడుగు కాళ్లతో కళాకారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సుబ్రమణ్యస్వామివారి కావడి నృత్యం అద్భుతంగా సాగింది.
అదేవిధంగా, బళ్లారి డ్రమ్స్, చెక్కభజనలు, వివిధ పౌరాణిక అంశాలతో రూపకాలు, కోలాటాలు, భరతనాట్యం, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర కళాకారుల స్థానిక జానపద కళారూపాలను ప్రదర్శించారు.