Site icon vidhaatha

Mallikarjun Kharge | చైనా దుర్నీతిని ఎండగట్టండి: ఖర్గే

Mallikarjun Kharge | న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయి చిన్‌ సహా భారత భూభాగాలు దేశం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయరానివని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. చైనా ఉల్లంఘనలను ప్రపంచ స్థాయిలో ఎండగట్టేందుకు జీ20 సమావేశాలు మరో అవకాశమని చెప్పారు. 2020 నాటి యథాతథ స్థితి కొనసాగింపు అనేది అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి వెనకడుగు వేయరాదని అన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ చేస్తూ.. అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయి చిన్‌ సహా భారత భూభాగాలన్నీ అవిభాజ్యమైనవని, ఏకపక్ష కల్పిత మ్యాప్‌ల ద్వారా వాటిని మార్చజాలరని పేర్కొన్నారు. ఈ విషయంలో చైనా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని విమర్శించారు. భారతీయ భూభాగాలకు పేర్లు పెట్టడం గానీ, చట్టవిరుద్ధ ప్రాతినిథ్యాలుగానీ కాంగ్రెస్‌ సహించబోదని స్పష్టంచేశారు. చైనా సహా ఇరుగు పొరుగువారితో శాంతియుత సహజీవనాన్ని తాము కోరుకుంటున్నామని, వాస్తవాధీన రేఖ వద్ద శాంతియుత పరిస్థితులు ఉండాలని భావిస్తున్నామని తెలిపారు.

Exit mobile version