చీపురు తిరగేసి బ్యాడ్మింటన్‌ ఆడితే ఇట్టాగే ఉంటాదా!

తమ ప్రతిభ చాటుకోవడానికి గతంలో నానా కష్టాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఒక రీల్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తే చాలు

  • Publish Date - March 1, 2024 / 12:17 PM IST

తమ ప్రతిభ చాటుకోవడానికి గతంలో నానా కష్టాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఒక రీల్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తే చాలు.. ఆ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. చాలామంది సాధారణ స్థాయివారు సైతం రీల్స్‌తో ప్రఖ్యాతి పొందుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో  ఒక వ్యక్తి బ్యాడ్మింటన్‌ ఆడిన తీరు.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నది. అతడిని లెజెండ్‌ అంటూ కీర్తిస్తున్నారు. బ్యాడ్మింటర్‌ ఆడటం అంటే మామూలుగా కాదండోయ్‌.. చీపురు తిరగేసి.. ఆడాడు. ఎక్కడా తగ్గకుండా.. పాయింట్‌ కూడా స్కోర్‌ చేశాడు. ఈ వీడియోను జతిన్‌ శర్మ అనే వ్యక్తి పోస్ట్‌ చేయగా.. దాదాపు 30 లక్షల వ్యూస్‌ లభించాయి. బ్యాడ్మింటన్‌ కోర్టులోకి వచ్చిన అతడు.. చాకచక్యంగా చీపురు తిరగేసి బ్యాడ్మిటన్‌ ఆడిన తీరు.. చూస్తే ముచ్చటేస్తుంది.

ఒక పురుషుడు, ఒక మహిళ బ్యాడ్మిటన్‌ ఆడుతుండగా.. సదరు వ్యక్తి కోర్టులోకి ప్రవేశించడం వీడియోలో కనిపిస్తుంది. జతిన్‌ ప్రవేశించిన తర్వాత ఆట అనుకోని మలుపు తిరుగుతుంది. బ్యాడ్మిటన్‌ రాకెట్‌కు బదులు తన చేతిలో ఉన్న చీపురుకట్టను తిరగేసి.. దాన్నే రాకెట్‌గా మల్చుకుని తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. చివరిలో ఒక పాయింట్‌ కూడా స్కోర్‌ చేశాడు. ‘చివరి వరకూ చూడండి.. ఒక పుస్తకాన్ని దాని కవర్‌ పేజీని బట్టి అంచనా వేయకండి..’ అని ఆ వీడియోకు క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణకు నోచుకున్నది. కొందరు జతిన్‌ను లెజెండ్‌ అంటూ కీర్తించేశారు. కొందరు సృజనాత్మక కామెంట్లతో అతడిని  ప్రోత్సహించారు. ‘ఇండియా ఈజ్‌ నాట్‌ ఫర్‌ బిగినర్స్‌’ అని ఒకరు స్పందించగా.. రాకెట్ల కొనుగోళ్లకు సొమ్మంతా వృథా చేసుకున్నా..  అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. ‘అతడు చీపురుకట్టతో బ్యాడ్మింటన్‌ ఆడుతున్నాడు.. మొత్తం విశ్వంలోనే ఈయనంతటి బలమైన వ్యక్తి లేడు’ అని ఒకరు రాశారు. సంప్రదాయేతర పద్ధతిలో ఆడిన ఈ ఆటకు అనేక మంది అనేక పేర్లు పెట్టారు.

Latest News