Congress | ఖమ్మం సీటు తెరపైకి ‘మండవ’

  • Publish Date - April 10, 2024 / 11:38 AM IST

విధాత‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేసిన ఉమ్మడి జిల్లాలో ఖమ్మం ఒకటి. మొత్తం 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఇదే సమయంలో ఖమ్మం పార్లమెంటు సీటు కోసం ఆ పార్టీలోనే పోటీ ఎక్కువగానే ఉన్నది.

ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాదరెడ్డి కోసం పట్టుపడుతున్నారు.అదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని ఇవ్వాలని కోరుతున్నారు. వీళ్లతోపాటు మరో మంత్రి తుమ్మల తన తనయుడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లే కాకుండా మాజీ ఎంపీ, పాత తరం కాంగ్రెస్‌ నేత ఆర్‌. సురేందర్‌ రెడ్డి తనయుడు రఘురామరెడ్డి పేరు తెరమీదికి వచ్చింది. రఘురామరెడ్డి పొంగులేటికి వియ్యంకుడు. ఒకవేళ తన తమ్ముడికి టికెట్‌ ఇవ్వకుంటే రఘురామరెడ్డికి ఇచ్చినా ఓకే అని పొంగులేటి అధిష్ఠానానికి చెప్పినట్టు సమాచారం.

పోటీ తీవ్రంగా ఉండటంతో వీరందరిని నొప్పించకుండా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని గాంధీ కుటుంబం నుంచి ప్రియాంకను, రాహుల్‌ గాంధీని పోటీ చేయాలని కోరారు. కానీ వాయనాడ్‌ నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గతంలో రాహుల్‌ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్ర తాను అక్కడి నుంచి పోటీ చేయాలనే కోరికను బైటపెట్టారు. అలాగే ప్రియాంక తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీ నుంచి పోటీ చేస్తారా? లేక అమేథీ నుంచి పోటీ చేస్తారా? అన్నది ఇంకా స్పష్టత లేదు. దీంతో తెలంగాణ నుంచి గాంధీ కుటుంబం నుంచి ఎవరినైనా పోటీ చేయించాలనే రాష్ట్ర నాయకత్వ ప్రతిపాదన సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ తమ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావును ప్రకటించింది. వీరిద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. కాంగ్రెస్‌ పార్టీ అదే సామాజికవర్గ నేతకు టికెట్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో నిజామాబాద్‌కు చెందిన మండవ వెంకటేశ్వర్‌రావు పేరు ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. మంత్రులు పొంగులేటి, భట్టి కుటుంబసభ్యుల్లో ఎవరికి ఇచ్చినా మరొకరు వ్యతిరేకిస్తారు. అందుకే మండవ వెంకటేశ్వర్‌రావు పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే పొంగులేటి, భట్టిలను కాదని స్థానికేతర నేతకు టికెట్ ఇస్తే వీళ్లంతా కలిసి పనిచేస్తారా? పార్టీ గెలుపుకోసం కృషి చేస్తారా? అన్నది సందేహమే అంటున్నారు.

ఖమ్మం సీటుపై క్లారిటీ వచ్చి అభ్యర్థి ఖరారైన తర్వాతే కరీంనగర్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, బీజేపీ నుంచి బండి సంజయ్‌ పోటీలో ఉన్నారు. దీంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలుపాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచిస్తున్నది. హుస్నాబాద్‌ అసెంబ్లీ టికెట్‌ త్యాగం చేసిన ప్రవీణ్‌రెడ్డికి ఇస్తుందా? లేక వెలిచాలా రాజేంద్రరావుకు అవకాశం కల్పిస్తుందా అన్నది రెండు మూడు రోజుల్లో తేలనున్నది.

Latest News