Site icon vidhaatha

Manik Rao Thackeray | కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓటమికి ప్రయత్నించిన BRS

Manik Rao Thackeray

విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి బీఆర్‌ఎస్‌ ప్రయత్నించిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌ రావు ఠాక్రే తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత గాంధీభవన్‌లో సీనియర్‌ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో కుమార స్వామికి మద్దతు ఇచ్చిందన్నారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావితం చేస్తాయన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కర్ణాటక ప్రజలు బీజేపీకి చెంపపెట్టు రిజల్ట్ ఇచ్చారన్నారు. కర్ణాటక మాదిరే తెలంగాణలో కూడా అసమర్థత, అవినీతి నడుస్తుందన్నారు. నాయకులమంతా ఐక్యంగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తామన్నారు.

సీనియర్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ మా నేతలు ఇగోలు పక్కకు పెట్టాలని హితవు పలికారు. మానిక్ రావ్ ఠాక్రేతో మాట్లాడుకొని గ్యాప్ లేకుండా చూసుకోవాలని కోరారు. 2024 లో రాహుల్ దేశ ప్రధాని అవుతారని జోష్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్ముతున్నారన్నారు.

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ 2024 లో 1980 చరిత్ర రిపీట్ అవుతుందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసింది, ఏం చేయబోతోంది అనే విషయం చెపుతామన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ నియంతృత్వా నికి, అహంకారానికి ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. కర్ణాటక నేతల మధ్య గ్యాప్ ఉన్నా అందరూ కలిసి కట్టుగా పని చేశారని, ఇలానే తెలంగాణ లో కూడా పని చేయాలని నేతలను కోరారు.

కర్ణాటక మాదిరి తెలంగాణలో పంథాని కొనసాగించాలన్నారు. అన్ని వర్గాల వాళ్ళు మతతత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ని ఓడించాలని జానారెడ్డి పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మేము అందరం కలిసి కట్టుగా పని చేస్తామని జానా తెలిపారు.

Exit mobile version