Many doubts about the death of Dr. Preeti
విధాత: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజి ((కెఎంసి) పిజి విద్యార్థిని డాక్టర్ ప్రీతి ధరావత్ ఆత్మహత్య కేసులో రోజు రోజుకు కొత్త ప్రశ్నలు వెలుగులోకిి వస్తున్నాయి. ప్రీతి ఆత్మహత్యపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బలవన్మరణం కోసం ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్ మొదలు హైదరాబాద్ నిమ్స్ తరలించే వరకు ఏం జరిగిందనే దానిపై లంబాడా హక్కుల ఐక్య వేదిక పలు ప్రశ్నలు సంధించింది. తమ డిమాండ్స్ పై సమాధానం చెప్పాలని ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించారు. డిక్లరేషన్‌లో డిమాండ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ ప్రీతి ధరావత్ అపస్మారక స్థితిలో ఉండగా తొలుత చూసింది ఎవరు?
- అపస్మారక స్థితిలో ఉండగానే ఆమె చేయి ఎందుకు కమిలిపోయింది?
- అపస్మారక స్థితి నుంచి తండ్రికి ఫోన్ చేసే సమయం వరకు మధ్యలో ఏం జరిగింది. అపస్మారక స్థితిలో ఉండగానే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?
- ఆమె మొబైల్ ఫోన్ ఫింగర్ ప్రింట్ లాక్‌లో ఉండగా డేటాను డిలీట్ చేసిందెవరు. బ్యాచ్ మెట్లతో చేసిన ఛాటింగ్‌లను ఎందుకు తొలగించారు?
- ప్రీతి మొబైల్లో ఛాటింగ్ హిస్టరీ చూడాల్సిన అవసరం ఏమొచ్చింది. హిస్టరీలో డ్రగ్ గురించి సెర్చ్ చేశారని ఫేక్ ఎవిడెన్స్ సృష్టించి, కేసును తప్పుదోవ పట్టించారనే అనుమానం ఉంది?
- ప్రీతి తండ్రి ఘటనా స్థలానికి చేరుకోకముందే కెఎంసి డిపార్ట్ మెంట్ హెడ్ లు అక్కడికి చేరుకుని ఏం చేశారు?
- వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఆమెకు ఏ రకమైన చికిత్స అందించారు.
- మెరుగైన చికిత్స పేరుతో హైదరాబాద్ నిమ్స్ తరలించి ఏ విధమైన చికిత్స చేశారో బహిరంగపర్చడం లేదు ఎందుకు?
- మానసికంగా వేధించి సీనియర్ డాక్టర్ ఎం.ఏ.సైఫ్ తో పాటు సంబంధం ఉన్న వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదు?
- ప్రీతి తనకు చెప్పకుండా డిపార్ట్ మెంట్ హెడ్ దగ్గరికి వెళ్తుందా అనే మాటలపై సమాధానం ఎవరు చెబుతారు?
- డాక్టర్ ప్రీతి పై పోలీసులకు ఫిర్యాదు రాగానే చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించింది?