- 15 దుకాణాలు, ఇండ్లకు మంటలు
- బకెట్ల ద్వారా నీటితో మంటలు
- ఆర్పడానికి ప్రయత్నిస్తున్న స్థానికులు
విధాత: ఆర్థిక రాజధాని ముంబైలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 15 దుకాణాలు, ఇండ్లకు మంటలు అంటున్నాయి. గోవండిలోని బైగన్‌వాడిలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లోని దాదాపు 15 గాలాస్ (వాణిజ్య యూనిట్లు), మొదటి అంతస్తులోని కొన్ని ఇండ్లు మంటల్లో దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. స్థానిక నివాసితులు కూడా నీటి బకెట్లతో మంటలను ఆర్పడం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తున్నది. ఎలక్ట్రిక్ వైరింగ్, ఇన్‌స్టాలేషన్, గృహోపకరణాలు, ఏసీ షీట్లు, ప్లాస్టిక్ షీట్లు, ఎల్‌పీజీ సిలిండర్లు, చెక్క పలకలు, ఫర్నీచర్‌కు మంటలు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బది ఫైర్ శకటాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకొని సమపంలోని దుకాణాలను, ఇండ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున బోరివలి సమీపంలోని బహిరంగ పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగాయి. 20కి పైగా ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి.