Site icon vidhaatha

పేలిన LED TV.. ఇల్లు ధ్వంసం.. యువ‌కుడు మృతి

విధాత : ఎల్ఈడీ టీవీ పేల‌డంతో ఇల్లు ధ్వంసమైంది. ఓ యువ‌కుడు మృతి చెందాడు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఓమేంద్ర అనే యువ‌కుడు త‌న త‌ల్లి, వ‌దిన‌, స్నేహితుడితో క‌లిసి ఇంట్లోనే టీవీ చూస్తున్నాడు. ఆక‌స్మాత్తుగా ఎల్ఈడీ టీవీ పేలిపోయింది. భారీ శ‌బ్దం వ‌చ్చింది. ఇల్లు ధ్వంసమైంది. క‌ప్పు కూడా దెబ్బ‌తిన్న‌ది. ఒక గోడ పూర్తిగా కూలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఓమేంద్ర చ‌నిపోగా, త‌ల్లి, వ‌దిన, స్నేహితుడు క‌ర‌ణ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సంద‌ర్భంగా స్థానికురాలు వినిత మాట్లాడుతూ.. ఎల్ఈడీ టీవీ పేలిపోయిన‌ప్పుడు భారీ శ‌బ్దం వ‌చ్చింద‌న్నారు. గ్యాస్ సిలిండ‌ర్ పేలింద‌ని అనుకున్నామ‌ని తెలిపింది. భ‌యంతో తాము బ‌య‌ట‌కు పరుగెత్తి వ‌చ్చి చూడగా ఆ ఇంట్లో నుంచి ద‌ట్ట‌మైన పొగ‌లు వ‌చ్చాయ‌ని చెప్పింది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఎల్ఈడీ టీవీ పేలుడు ధాటికి మొత్తం న‌లుగురికి గాయాలైన‌ట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఓమేంద్ర మృతి చెందాడ‌ని పేర్కొన్నారు. మ‌రో ముగ్గురు చికిత్స పొందుతున్నార‌ని, ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version