Site icon vidhaatha

Medak | అనుమ‌తుల్లేని ఇండ్ల కూల్చివేత‌.. అడ్డుకున్న బాధితులు.. కళ్లకల్‌లో ఉద్రిక్తత

Medak

విధాత, మెదక్ బ్యూరో: అనుమతి లేని నిర్మాణంలో ఉన్న ఇండ్లను మెదక్ కలెక్టర్ రాజర్షషా ఆదేశాల మేరకు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోరాబాధ్ మండలం కళ్లకల్ గ్రామంలో అధికారులు కూల్చివేశారు. బాధితులకు అండగా సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు టి నర్సారెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగి కూల్చేవేతలను అడ్డుకున్నారు.

ఈక్రమంలో పోలీస్ లు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పోలీస్ ల తోపులాటలో కిందపడి స్పృహ కోల్పోయారు. దాదాపు 20 నిమిషాల తరువాత నర్సారెడ్డి స్పృహ లోకి వచ్చారు. దీంతో కళ్ళకల్ లో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా వున్నాయి.

మెదక్ జిల్లా మనోహరాబాద్‌ గ్రామ ఉపసర్పంచ్ తుమ్మల రాజు యాదవ్ గ్రామంలో అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామ శివారులో అక్రమంగా అనుమతులు లేకుండా గోదాములు నిర్మిస్తున్నారని గ్రామానికి చెందిన యువకుడు బల్ల బోయిన రాజు యాదవ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ స్పందించి తక్షణమే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఉన్న పలు మండలాలకు చెందిన కార్యదర్శులు, తూప్రాన్ డి ఎల్ పి ఓ శ్రీనివాస లు తూప్రాన్ సబ్ డివిజన్ పోలీసు అధికారుల బందోబస్తు మధ్య గురువారం ఉదయం గ్రామానికి చేరుకొని జెసిబిల ద్వారా ఇండ్ల కూల్చివేత చేపట్టారు.

విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి గ్రామానికి చేరుకోగా బాధితులు ఒక్కసారిగా ఆయన కాళ్ళ మీద పడి మా ఇల్లు కూల్చి వేస్తున్నారని ఆపించండి అంటూ వేడుకున్నారు. స్పందించిన నర్సారెడ్డి అధికారులతో, పోలీసులతో వాగ్వాదానికి దిగి ఇల్లు కూల్చివేతను అడ్డుకున్నారు.

అనంతరం గ్రామ ప్రధాన రహదారిలో బాధితులతో కలిసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ధర్నాకు దిగారు. రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొన‌గా తూముకుంట నర్సారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి చర్యలు చేపట్టారు. దీంతో తోపులాట జరగగా నర్సారెడ్డి కింద పడిపోయారు. దీంతో ఆయన స్పృహ కోల్పోయారు.

అనంతరం ఆయనను పోలీసు వాహనంలో గజ్వేల్ ఇంటికి తరలించారు. గంటన్నర తరువాత మళ్ళీ గ్రామానికి చేరుకున్న నర్సారెడ్డితో పాటు బాధితులు కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ఇల్లు కూల్చివేయడం దారుణమని వారు మండిపడ్డారు. బాధితులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని లేనియెడల గ్రామంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కు, అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న నర్సా రెడ్డి కూతురు అంక్షారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆమెను కూడా పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version