- ఫ్రీజింగ్‌లో స్టేట్ ఫైనాన్స్
- గత సెప్టెంబర్ నుంచి జనరల్ ఫండ్ పరిస్థితి అంతే
- పూటగడవడం కోసం తంటాలు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి. పూట గడవడం కోసం ఎన్నో తంటాలు పడుతున్న దుర్భర జీవితం. అలాంటి పంచాయతీ సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామ పంచాయతీ (Gram Panchayat)ల ఖాతాల్లో నిధులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఫ్రీజింగ్ (Freezing)లో పెట్టడంతో సిబ్బంది వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. రోజూ తమ వెంట ఉంటూ అన్ని పనులూ చేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవడం పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందిగా మారింది.
అయితే ప్రత్యేక అకౌంట్లు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల(15th Finance Commission Funding)ను కొన్ని నెలలుగా పీఎఫ్ ఎంఎస్ ఖాతాలో జమ చేస్తుండటంతో పంచాయతీలకు ఇప్పుడిదొకటే మార్గంగా కనిపిస్తోంది.
గ్రామ పంచాయతీల నిధులు ఖాతాల్లో ఉన్నప్పటికీ ఖర్చు చేయకుండా సర్కార్ స్టేట్ ఫైనాన్స్ 15 వ ఆర్థిక సంఘం నిధుల ఖాతాలను ఫ్రీజింగ్‌లో పెట్టింది. జనరల్ ఫండ్ నిధులు వాడుకుందామంటే 2022 సెప్టెంబర్ నుంచి ఫ్రీజింగ్‌లోనే ఉండటంతో తమ దగ్గర పని చేస్తున్న సిబ్బందికి జీతాల విషయంలో ఏం చెప్పాలో తెలియక పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు పని చేసినా జీతాలు లేక దుర్భర జీవితం గడుపుతున్నామని పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న రాష్ట్రం గ్రామ పంచాయతీ సిబ్బందికి మాత్రం నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉంది.
గతంలో స్వీపర్‌కు ఒక వేతనం, పంప్ ఆపరేటర్‌కు ఒక వేతనం ఇలా పంచాయతీ పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి వారి వారి పనిని బట్టి వేతనం చెల్లించే వారు. ఇందులో మార్పు తీసుకువచ్చిన ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ పేరుతో గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందికి నెలకు రూ.8500 నిర్ణయించింది. పంచాయతీ అకౌంట్లలో నిధులు ఉన్నా.. కానీ సిబ్బందికి జీతాలు చెల్లించాలంటే ఫ్రీజింగ్ కారణంగా నిధులు విడుదల కావడం లేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి. పారిశుద్ధ్య పనులతో పాటు అన్ని రకాలు సేవలు అందిస్తూ 24 గంటల పాటు తన వెంట ఉన్న సిబ్బందికి సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. పంచాయతీల్లో ఖర్చులు పోను మిగిలిన నిధులను గ్రామంలో అభివృద్ధి పనులు చేయడానికి తీర్మానం చేశారు.
తీర్మానం చేసి నెలలు గడుస్తున్నప్పటికీ పనులు ప్రారంభించడం లేదని పంచాయతీ పాలకవర్గం ఒత్తిడి తీసుకువస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 1615 గ్రామపంచాయతీల్లోనూ ఇదే పరిస్ఠితి నెలకొంది.
4 నెలలుగా జీతాలు లేవు
తమకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం బూరుగు పల్లి గ్రామపంచాయతీ కార్మికుడు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాకపోవడంతో నిత్యవసరాలు తీర్చుకోలేక అవస్థు పడుతున్నామన్నారు.
– ప్రవీణ్, గ్రామపంచాయతీ కార్మికుడు