Site icon vidhaatha

Medak: యాసంగి పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోండి: పౌర సరఫరాల కమీషనర్

విధాత, మెదక్ బ్యూరో: యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి ఈనెల 3వ వారంలో ఏర్పాటు చేయబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయవలసినదిగా రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లతో కలిసి సంబంధిత శాఖలు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన కాంటాలు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడి కాలీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అవసరం మేరకు కొత్త,పాత గన్ని సంచులు నిష్పత్తి ప్రకారం అందించాలని సూచించారు. వేసవి తాపం దృష్ట్యా ప్రతి కేంద్రంలో షామియానా, మంచి నీరు ఏర్పాటు చేయాలని సూచించారు.

డిజిటల్ కాంటాలను, ధర్మా కాంటాలను ఒకసారి పరిశీలించవలసినదిగా తూనికలు, కొలతల శాఖాధికారి సూచించారు. కొనుగోలు కేంద్రాలలో తూకంలో తేడా రాకుండా చూడాలని, గ్రామా వారీగా రైస్ మిల్ కు టాగ్ చేసిన ప్రకారం రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చేలా టోకెన్లు క్రమపద్దితిలో జారీచేయాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు, ధర్నాలకు తావివ్వకుండా పారదర్శకంగా, సజావుగా కేంద్రాలు నిర్వహించాలని, ఏదేని సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఇతర ప్రాంతాల నుండి ధాన్యం రాకుండా నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. అసాధారణ రీతిలో ధాన్యం వస్తే వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లుల వద్ద 24 గంటలలో ధాన్యం దించుకునేలా చూడాలని, టాబ్ ఎంట్రీ చక చకా చేస్తూ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చూడాలన్నారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో ఇటీవల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి మార్గ నిర్దేశం చేశామన్నారు. వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా మరోమారు క్లస్టర్ వారీగా గ్రామా వారీగా కేంద్రాలకు ధాన్యం వచ్చే ఖచ్చితమైన వివరాలను సేకరించామన్నారు. ఈ యాసంగిలో 4 లక్షల 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా 402 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

అందులో ఐ.కె.పి . ఆధ్వర్యంలో 110 కేంద్రాలు, ఫ్యాక్స్ ద్వారా 279 కేంద్రాలు, డిసిఎంఎస్ ద్వారా 8 కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా 5 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో కేంద్రాల నిర్వాహకులకు తగు శిక్షణ ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. చెక్ లిస్ట్ ప్రకాక్రం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని నూతనంగా 3 వేల టార్పాలిన్లు కొనుగోలు చేస్తున్నామని అన్నారు.

రవాణాకు వేయి లారీలు సమకూరుస్తూ 33 బాయిల్డ్ రైస్ మిల్లులకు జియో ట్యాగింగ్ చేస్తున్నామని, రైస్ మిల్లులలో హమాలీలు ఎక్కువగా పెట్టుకొని లారీ వచ్చిన 24 గంటలలో ధాన్యం దించుకునేలా మిల్లర్లకు తగు ఆదేశాలిచ్చామని అన్నారు. ఈ నెల 12 న అందరు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తమరి ఆదేశాలను వివరిస్తామని అన్నారు.

జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రాకుండా, రైస్ మిల్లుల వద్ద లారీల నిలుపుదల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అవసరమైన పొలిసు సహకారమందిస్తామన్నారు.
కాగా కొందరు రైస్ మిల్లర్లు మాట్లాడుతూ ఎదో ఒక చిన్న కారణంతో ఎఫ్.సి.ఐ వారు ధాన్యం రిజెక్ట్ చేస్తున్నారని, గొనె సంచులు కొత్తవి సరఫరా చేయాలని కోరారు.

సమావేశంలో పౌర సరఫరాల జనరల్ మేనేజర్ రాజి రెడ్డి, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, డీఆర్డీ ఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, జిల్లా సహకాక్ర అధికారి కరుణ, తూనికలు ,కొలతల అధికారి సుధాకర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిచర్డ్, రైస్ మిల్లుల యజమానులు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ లు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version