Site icon vidhaatha

Medaram | మేడారం భక్తులకు శుభవార్త.. ఆ ఫీజు మినహాయింపు


Medaram | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం జాతర ముగిసే వరకు అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.


ఈ నిర్ణయం కూడా తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా పర్యావరణ రుసుము (ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఫీజు) వసూలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జాతరకు వచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు.


ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారంల నుంచి వచ్చే వాహనాల నుంచి నామమాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అటవీ శాఖ వసూలు చేస్తోంది. ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్లిక్ ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినియోగిస్తోంది. అయితే వివిధ వర్గాల నుంచి విజ్జప్తి మేరకు జాతర ముగిసే దాకా ఈ ఫీజు వసూలు నిలిపివేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీశాఖ కోరింది.

Exit mobile version