Ayodhya | అయోధ్యలో శ్రీరామ నవమికి కోటి మంది భక్తులు..! ఏర్పాట్లను ప్రారంభించిన తీర్థక్షేత్ర ట్రస్ట్‌..!

అయోధ్య రామమందిరంలో బాల రామయ్య కొలువుదీరిన నాటి నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతి రోజూ ఒకటిన్నర నుంచి రెండులక్షల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు

  • Publish Date - February 10, 2024 / 10:36 AM IST

Ayodhya | అయోధ్య రామమందిరంలో బాల రామయ్య కొలువుదీరిన నాటి నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతి రోజూ ఒకటిన్నర నుంచి రెండులక్షల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. 18రోజుల్లో దాదాపు 40లక్షల మంది దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం రద్దీ కొనసాగుతున్నది. అంచనా ప్రకారం రామ నవమి సందర్భంగా కోటిమంది భక్తులు అయోధ్యకు వస్తారని అంచనా. క్రౌడ్‌ కంట్రోల్‌ ప్లాన్‌పై ఇప్పటికే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.


ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను సైతం సిద్ధం చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు రామ నవమి జాతర జరుగుతుంది. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున ప్రధాన పండుగ ‘రామజన్మోత్సవ్‌’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి ఏప్రిల్ 17న రామ నవమి జరుగనున్నది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.


అయోధ్యలో తొమ్మిది రోజుల వివిధ కార్యక్రమాలు కొసాగుతాయి. గతేడాది రామనవమి రోజున దాదాపు 2.25 లక్షల మంది భక్తులు తాత్కాలిక ఆలయంలో రామలాలా స్వామిని దర్శించుకున్నారు. అయోధ్యకు 25 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. అప్పట్లో రాంలాల దర్శనానికి మార్గం ఇరుకుగా ఉండేది. తాత్కాలిక ఆలయంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులుపడాల్సి వచ్చేది. ప్రస్తుతం నూతన ఆలయంలో సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించారు. 100 అడుగుల వెడల్పుతో రామజన్మభూమి మార్గాన్ని నిర్మించారు. విశాలమైన గర్భాలయంలో రాంలల్లాను ప్రతిషించారు.


ఈ నేపథ్యంలో రామ నవమి సందర్భంగా సుమారు కోటి మంది ప్రజలు అయోధ్యకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రద్దీ పెరగడంతో క్షీరేశ్వరనాథ్ ఆలయానికి ఎదురుగా ఉన్న రామజన్మభూమి గేట్ నంబర్ మూడో నుంచి భక్తులను తరలించాలని నిర్ణయించారు. 40 అడుగుల వెడల్పు రోడ్డు కూడా పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. అంతేకాకుండా, ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రహదారిని కూడా నిర్మిస్తున్నారు. రామజన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్‌కు అనుసంధానించడానికి సుగ్రీవ్ పథ్‌ని సిద్ధం చేసే ప్రణాళిక సైతం రూపొందించారు.

Latest News