Jamili Elections |
- ఈ నవంబర్ నుంచి వచ్చే నవంబర్ వరకు మొత్తం 12 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
- ఏప్రిల్ నెలలోనే లోక్‌సభకు కూడా ఎన్నికలు
- అన్నీ కలిపి మధ్యేమార్గంగా మినీ జమిలి!
- ప్రతిపక్షాలకు చెక్ చెప్పేందుకు మోదీ ప్లాన్?
- ఏపీ నేతల్లో ఊపందుకున్న ఊహాగానాలు
- సిద్ధంగా ఉండాలంటున్న పార్టీల అధినేతలు
- అభ్యర్థుల జాబితాల తయారీలో బిజీ బిజీ
- ప్రజలలో ఉండేందుకు పోటాపోటీ యాత్రలు
- పార్టీల్లో మొదలైన ‘వనరుల’ సమీకరణ
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ కంటే రెండు నెలలు ఓపిక పట్టాలా? ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఫిబ్రవరిలోనే ముందస్తుకు సిద్ధపడాలా? వీటితోపాటు పార్లమెంటుకు కూడా ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తారా? ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయమైన సంకేతాలు, తెలుగు రాష్ట్రాల పార్టీల నాయకుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను గమనిస్తే.. అవుననే సమాధానమే వస్తున్నది. ఇది వాస్తవరూపం దాల్చితే.. లోక్సభతోపాటు 12 రాష్ట్రాల అసెంబ్లీలను కలుపుకొని.. మినీ జమిలి ఎన్నికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాని మోదీ ముందస్తుకు వెళతారన్న చర్చ గతంలోనూ గట్టిగానే సాగింది. ప్రతిపక్షాలు ఐక్యం కావడానికి ముందే ఎన్నికలకు వెళితే వాటి ప్రభావాన్ని నిరోధించవచ్చనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇందులో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, మిజోరం ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లకు ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు కూడా ఏప్రిల్లోనే జరుగనున్నాయి. వీటన్నింటినీ కలిపి మినీ జమిలిగా ఎన్నికలకు పోవాలనేది బీజేపీ పెద్దల ఆలోచనగా అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఈ 12 రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం తెలంగాణలో ఎన్నికలను రెండు నెలలు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తారని తెలుస్తున్నది. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మర్లో ఎన్నికల నిర్వాహణ కేంద్రానికి పెద్దగా ఇబ్బందికాదు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందస్తు ప్రతిపాదనకు సమ్మతిస్తారనే అభిప్రాయం ఉన్నది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (షిండే) సంకీర్ణం ఉన్నది. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉన్నది.
ఈ అంశాల ఆధారంగా మినీ జమిలికి కేంద్రం ఆలోచన చేస్తున్నదన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నది. బీజీపీ అగ్రనేతలు ఈ మధ్యేమార్గ ‘మినీ జమిలి’ ఎన్నికల ప్రతిపాదనను ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ప్రస్తావించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీనికి ఏపీ సీఎం ఇప్పటికే అంగీకరించినట్టు జాతీయ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. అందుకే జగన్ ఇటీవల ఏపీలో అభివృద్ధి ప్రచార సభలతో హడావుడి చేస్తున్నారని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు?
తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ అభీష్టంగా చెబుతున్నారు. నిజానికి తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు డిసెంబర్‌లో, ఏపీలో ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్‌లో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికలు ఉన్నాయి. అలాగే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ప్రస్తుతం కేంద్రం పెద్దలు ఆలోచన ప్రకారం డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలతో పాటుగానే, వచ్చే ఏడాది నవంబర్లోపు ఎన్నికలు జరగాల్సిన 7 రాష్ల్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి 2024 ఫిబ్రవరిలో అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికలకు వెళ్లాలనేది వ్యూహంగా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోదీ ఈ దిశగా తన కార్యాచరణ వేగవంతం చేశారని ఢిల్లీ వర్గాల సమాచారం.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికల కోసం ఏపీ బీజేపీ నేతలు కేంద్రంతో చర్చిస్తున్నారని వారి పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. ముందస్తుకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా మొదలు పెట్టారని, ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఒక రౌండు సమీక్ష పూర్తి చేసి, రెండో దశ కసరత్తుకు సిద్ధమవుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో పవన్ నేరుగా టచ్లో ఉంటే.. ఏపీ సీఎం జగన్ తరచూ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. టీడీపీ సైతం బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పవన్, జగన్, టీడీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో ముందస్తు ఖాయమని చెబుతున్నారన్న సమాచారాలు.. ఎన్నికల వేడిని రాజేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ జూలై మొదటివారంలో ఢిల్లీ పర్యటన ముందస్తు ఎన్నికల పై చర్చ కోసమే అనే ప్రచారమూ జరిగింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ విషయం వెల్లడించారు కూడా. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానితో సీఎం జగన్ ఇదే అంశం పై మాట్లాడినట్లు తనకు తెలిసిందని కూడా రఘురామ తెలిపారు.
తొలి జాబితా కోసం పార్టీల కసరత్తు
వైఎస్ జగన్ సైతం తన పార్టీ అభ్యర్థుల జాబితా తయారీతో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను దాదాపు పూర్తి చేశారని, గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి, ప్రజల్లో గ్రాఫ్ పడిపోయిన కొంతమందిని, పార్టీ అధినేతను ధిక్కరించిన వారిని పక్కనబెట్టి జాబితా తయారు చేసినట్లు చెబుతున్నారు. సిటింగ్లలో సుమారు 16 మంది వరకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.
బీజేపీతో కలిసి పవన్ పోటీ!
మరోవైపు పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెనాలి జనసేన అభ్యర్థిగా నాదేండ్ల మనోహర్ పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ కళ్యాణ్, వారాహి యాత్ర 3వ విడుత ముగిసిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసారి పవన్ కళ్యాణ్ ఒకే నియోజకవర్గంలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు, భీమవరం లేదా అనంతపురం నియోజకవర్గాల నుంచి పవన్‌ను పోటీ చేయాలని పార్టీ నాయకులు కోరుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సైతం…!
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. మరోవైపు బీఆర్ ఎస్ పార్టీ ఈ నెల 21న సుమారు 60మందితో తొలి జాబితా విడుదల చేయడానికి రెడీగా ఉందనే వార్తలు ఇప్పటికే వెలువడ్డాయి.
తగ్గుతున్న మోదీ ఛరిష్మా
కర్ణాటక ఎన్నికలలో స్వయంగా ప్రధాని మోదీ గల్లీస్థాయి నాయకుడిగా విస్తృత ప్రచారం చేసినా బీజేపీ ఓడిపోవడం, గతంతో పోల్చితే మోదీ గ్రాఫ్ తగ్గుతుందన్న సంకేతాలు, పదేళ్ల బీజేపీ ప్రభుత్వంపై సహజంగానే ఏర్పడే వ్యతిరేకత వంటి అంశాలు పార్లమెంటుకు ముందస్తు ఎన్నికల దిశగా బీజేపీని ఆలోచించేలా చేస్తున్నాయంటున్నారు.
ఐదు రాష్ట్రాలతో పాటు ఆ తర్వాత వచ్చే జమ్ముకశ్మీర్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆ పార్టీ నాయకత్వం అంతర్మథనం చెందుతున్నదని అంటున్నారు.
అదీగాక ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరుతో తమ రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం చేయడం బీజేపీని కలవరపెడుతున్నది. ఇండియా కూటమి బలపడకముందే పార్లమెంటు ఎన్నికలు తెచ్చి, కలిసొచ్చే రాష్ట్రాలతో మినీ జమిలీగా మార్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంపై బీజేపీ కసరత్తు చేస్తుందంటున్నారు.
మరోవైపు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ముందెన్నడూ లేని రీతిలో ఖరారు చేస్తుండటం గమనార్హం. అయితే ప్రతిపక్షాల ఎన్నికల సంసిద్ధతను పరీక్షించేందుకే బీజేపీ పార్లమెంటుకు ముందస్తు, మినీ జమిలి ప్రచారాలను తెరపైకి తెచ్చిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
జాతీయ నాయకత్వాల్లోనూ చర్చ
పార్లమెంటు ముందస్తు ఎన్నికలకు మోడీ ఆలోచన చేస్తున్నారంటూ బీహార్, బెంగాల్ సీఎంలు నితీశ్కుమార్, మమతా బెనర్జీ ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు సైతం మినీ జమిలికి ఊతమిస్తున్నాయి. మోదీ తత్వం తెలిసినవారు ఆయన మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అనూహ్యంగా ఎలాంటి నిర్ణయాలపైనా తీసుకుంటారని చెబుతున్నారు.
జమిలి ఎన్నికలకు రాజ్యాంగ సవరణలు, రాష్ట్రాల ఆమోదం వంటి ఆటంకాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రక్రియను లా కమిషన్ కు నివేదించి ప్రస్తుతానికి జమిలి లేనట్టేనని కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్రంలో మూడోసారి అధికారంలో రావడానికి రాజకీయంగా అనేక కోణాల్లో సాధ్యాసాధ్యాలను విశ్లేషించు కుంటున్న బీజేపీ నేతలు.. పార్లమెంటుకు ముందస్తు, మినీ జమిలీ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం లేక పోలేదంటున్నారు.
అటు విపక్షాలలో సైతం పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు.. లేక మినీ జమిలికి బీజేపీ సిద్ధపడితే తాము కూడా వాటిని ఎదుర్కోనేందుకు సన్నద్ధం కావాలన్న చర్చను ఇప్పటికే ఆరంభించాయి. ఈ నెలాఖరులో జరిగే ఇండియా కూటమి భేటీలో ముందస్తు ఊహాగానాలపై కూడా చర్చ జరుగుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. పార్టీ నాయకులంతా నా చుట్టూ తిరగడం వల్ల ఉపయోగం లేదు. ప్రజల చుట్టూ తిరగండి. జనం కష్టాలకు స్పందించండి. వారికి కాస్త ఓదార్పు ఇవ్వండి. నా సినిమాల గురించి మర్చిపోండి. ఏపీ అప్పుల గురించి, పోలవరం ఆగిపోవడం గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలతో, టీవీ డిబేట్లలో చర్చించండి.
– ఆగస్ట్ 4న మంగళగిరిలో పార్టీ కార్యవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్.
ఏపీకి ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావచ్చు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఏప్రిల్‌లో జరిగాలన్నది నా అభీష్టం. కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. ఎందుకైనా మంచిది మనం ప్రిపేర్‌గానే ఉందాం. మన సంక్షేమ పథకాలే మన అస్త్రాలు. -సన్నిహితులతో ఏపీ సీఎం వైఎస్ జగన్
ముందస్తు ఎన్నికల కోసం ఏపీ బీజేపీ నేతలు కేంద్రంతో చర్చిస్తున్నారు. మోదీ చెబితే జగన్‌కు ఇష్టం లేకున్నా కాదనే ధైర్యం లేదు. జగన్‌ను ఇటీవల పదేపదే ఈ విషయం మీదే ఢిల్లీకి పిలిపించుకున్నట్లు మనకు సమాచారం ఉంది. దేశంలో ప్రతిపక్షాలు ఏకం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది మోదీ, అమిత్ షా ప్లాన్‌గా చెబుతున్నారు. మనం కూడా ముందస్తుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. – పార్టీ నాయకులతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు