విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పోలీసు (Police) సిబ్బందికి సంగారెడ్డి మెడికల్ కాలేజీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు – ఆరోగ్య రక్ష (Police – Health Protection) కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) సోమవారం ప్రారంబించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడే పోలీసులు ప్రాణాలు ఎవరు కాపాడాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి పోలీసుకు పరీక్షలు చేసి, వైద్యం అందించడం జరుగుతుందని చెప్పారు. మొదట సిద్దిపేట, రెండోది సంగారెడ్డిలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు.
అనారోగ్యం ఉన్నట్లు గుర్తిస్తే, భార్యను పిలిచి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఆరోగ్య అలవాట్లు, భోజన అలవాట్లు, వ్యాయామం గురించి వివరించాలని తెలిపారు. ముందుగా రోగాలు గుర్తిస్తే నయం అయ్యేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు.
కేన్సర్ (Cancer) ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎంతో మందిని కాపాడవచ్చని, అనుమానం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకొని వైద్యం పొందాలని అయన సూచించారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.