- ప్రజా కోర్టులోనే బీజేపీకి బుద్ది చెప్తాం
- మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం
విధాత: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విషయంలో ఈడీ పరిధిని మించి ప్రవర్తిస్తుందని చట్ట ప్రకారం విచారణ జరుగడం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) మండిపడ్డారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి మహిళను రాత్రి వరకు విచారిస్తాం అంటే అది ముమ్మాటికీ వేధించడమేనని, రాజకీయ కక్ష్య సాధింపు చర్యనేనన్నారు. బీజేపీ పార్టీ నాయకుల ఆలోచనలు, స్టేట్ మెంట్ ఆధారంగానే ఈడీ పనిచేస్తుందని విమర్శించారు.
విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులని బీజేపీ ప్రభుత్వం వేధిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువైనాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విచారణ పేరుతో కవితను వేధిస్తున్నారని ఆరోపించారు.
ఈడీ అధికారులు మహిళల విచారణ చేసే క్రమంలో నిబంధనలు పాటించడం లేదన్నారు. కవిత ఎక్కడికి పారిపోవడం లేదని, విచారణకు సహకరిస్తానని చెప్పినా కూడా రాత్రి సమయం వరకు విచారించడం వేధించడమే అని అన్నారు.
మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లోసుగులను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టి బీజేపీ నుండి దేశాన్ని రక్షిస్తామన్నారు. బీజేపీ పార్టీ నాయకు కనుసన్నల్లో ఈడీ పనిచేస్తుందన్న మంత్రి ప్రజా కోర్టు లోనే బీజేపీకి బుద్ది చెప్తామన్నారు.